సాహో కోసం 400 కోట్ల డీల్??

Fri May 19 2017 12:41:28 GMT+0530 (IST)

బాహుబలి అఖండ విజయం తర్వాత దేశం మొత్తటా ప్రభాస్ పేరు మార్మోగిపోతోంది. బాహుబలి టైటిల్ కు వందశాతం న్యాయం చేసి ఆ క్యారెక్టర్ కు జీవం పోశాడు. ఇంతకు ముందువరకు కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే ప్రభాస్ అభిమానులు ఉండేవారు. బాహుబలి సినిమాతో దేశం మొత్తంమీద అమ్మాయిల కలల రాకుమారుడై పోయాడు. ఇప్పుడు తన రేంజి లోకల్ నుంచి నేషనల్ లెవెల్ కు వెళ్లిపోయింది. అందుకే ప్రభాస్ నెక్ట్స్ ఫిలిం ‘సాహో’ రూ. 150 కోట్లతో తీసేందుకు ఆ చిత్ర నిర్మాతలు సిద్ధమైపోయారు. ఈ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే హాట్ టాపిక్ గా మారిపోయింది.

బాహుబలి సినిమాతోపాటే సాహో సినిమా టీజర్ ను సైతం విడుదల చేశారు. దీనికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చేసింది. ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతెలుగు తమిళం హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి థియేటరికల్ రైట్స్ కోసం బాలీవుడ్ కు చెందిన పంపిణీ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిందని సమాచారం. అన్ని భాషల్లోనూ కలిపి రూ. 400 కోట్లకు కొనేందుకు సిద్ధమైందట ఈరోస్ ఇంటర్నేషనల్ గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ 1 నేనొక్కడినే వంటి తెలుగు సినిమాలను రిలీజ్ చేసింది. కానీ ఇంకా మొదలుకాని సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ ఆఫర్ రావడం అన్నది విశేషమనే చెప్పాలి.

సాహో యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతోంది. టీజర్ లోనే ఆ విషయం స్పష్టంగా చెప్పేశారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. రూ. 150 కోట్లతో నిర్మిస్తున్న సినిమాకు స్టార్టింగ్ లోనే రూ. 400 కోట్ల ఆదాయం లభించడమంటే నిర్మాతల పంట పండినట్టే. ఈ డీల్ గానీ ఓకే అయితే టాలీవుడ్ లో ఇదో కొత్త రికార్డు అవడం ఖాయం... అప్పుడు ప్రభాస్ కు మరోసారి సాహో చెప్పేయొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/