Begin typing your search above and press return to search.

సెన్సేషనల్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   9 Feb 2016 6:20 AM GMT
సెన్సేషనల్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది
X
భారత క్రికెట్లో అత్యంత వివాదాస్పదమైన ఆటగాడు ఎవరంటే మరో మాట లేకుండా అజహరుద్దీన్ పేరు చెప్పేస్తారు ఎవరైనా. భారత గొప్ప కెప్టెన్లలో ఒకడిగా ఎంత మంచి పేరు సంపాదించాడో.. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని అంత చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నాడు అజహర్. ఒకప్పుడు వేనోళ్ల పొగిడిన వాళ్లే.. ఆ తర్వాత అతణ్ని తిట్టిపోశారు. ఆ కేసు నుంచి బయటపడ్డప్పటికీ అజహర్ పై పడ్డ మచ్చ మాత్రం చెరిగిపోలేదు. ఇలాంటి వివాదాస్పద వ్యక్తి కథతో సినిమా తీస్తే జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంటుందనడంలో సందేహం లేదు. ఏక్తాకపూర్ అదే పని చేస్తోంది. ఆమె నిర్మాణంలో టోనీ డిసౌజా దర్శకత్వంలో ‘అజహర్’ సినిమా రూపొందుతోంది.

బాలీవుడ్ ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మి ఈ చిత్రంలో అజహర్ పాత్ర పోషిస్తున్నాడు. నర్గీస్ ఫక్రి, ప్రాచి దేశాయ్, హ్యూమా ఖురేషి లాంటి హాట్ భామలు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బయటికి వచ్చేసింది. నిన్న అజహర్ పుట్టిన రోజు సందర్భంగా హష్మి అతడికి పుట్టిన రోజు కానుకగా ‘అజహర్’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు. 80ల్లో అజహర్ కెరీర్ తొలి రోజుల్లో ఉన్న తరహాలోనే క్రికెట్ దుస్తుల్లో కనిపిస్తున్నాడు హష్మి. ఈ పోస్టర్ జనాల్లో బాగానే ఆసక్తి రేపుతోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.