అన్నగారి దీవెనలు సరిపోవా.. ఈసీ దీవెనలు కావాలా?

Thu Mar 14 2019 16:48:21 GMT+0530 (IST)

గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.  సినిమా ప్రోమోస్ కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది కానీ థియేటర్ కు వెళ్లి ఎంతమంది చూస్తారు అనేది రిలీజ్ అయితే తప్ప మనకు తెలీదు.   ఈ సినిమా అసలు ఎలెక్షన్స్ లోపు రిలీజ్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఖచ్చితంగా సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేసి తీరతానని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు.  ఈ సినిమాను రిలీజ్ కానివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని.. అలా ఎవ్వరూ చేయలేరని..  ఒకవేళ తనను చంపేసినా కూడా సినిమాను వెంటనే ఫ్రీగా యూట్యూబ్ లో పెట్టేందుకు సన్నాహాలు చేశానని అంటున్నాడు.  చంపడం సంగతేమో కానీ ఎవరైనా సినిమా తీసేది డబ్బు కోసమే కదా. అలాంటిది ఫ్రీగా యూట్యూబ్ లో పెట్టాలనే ఉద్దేశం ఎవరికీ ఉండదు.  థియేటర్లో రిలీజ్ చేయాలనే ఆలోచనతోనే ఎవరైనా సినిమా తీస్తారు.

ఈ సినిమా తీయడంలో వర్మకు కానీ నిర్మాతలకుకానీ రాజకీయ ఉద్దేశాలు లేనప్పుడు ఎలెక్షన్స్ కు ముందు రిలీజ్ అయితేనేం.. ఎలెక్షన్స్ తర్వాత రిలీజ్ అయితేనేం? ఒకవేళ పొలిటికల్ మోటివేషన్స్ తో ఈ సినిమా తీసి.. వారికి లాభం చేకూరాలంటే మాత్రం సినిమా ఖచ్చితంగా ఎలెక్షన్స్ డేట్ కు ముందే రిలీజ్ కావాలి.  ఇప్పుడు ఎలెక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్న సినిమాను విడుదలకు అనుమతించే విషయంలో ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.  ఇదంతా చూస్తుంటే ఉరుములేని పిడుగులా వచ్చిన ఎలెక్షన్ షెడ్యూల్ రాజకీయ పార్టీలకంటే వర్మను ఎక్కువగా షాక్ కు గురి చేసిందని చెప్పాలి.   అన్నగారి దీవెనలు ఉన్నాయి అని గట్టిగా చెప్పుకుంటున్న ఆర్జీవీకి ఇప్పుడు కావాల్సింది ఈసీ దీవెనలు.  ఆ దీవెనలు ఉంటేనే సినిమా మార్చ్ 22 న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.. లేకపోతే ఇంకేముంది.. తీరిగ్గా ఎలెక్షన్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసుకోవడమే.