అశ్లీలం చూసేవాళ్లకు లేదు కానీ!-ఏక్త

Sat May 18 2019 13:10:57 GMT+0530 (IST)

డిజిటల్ మీడియాలో విచ్ఛలవిడితనం గురించి సాంప్రదాయ వాదుల్లో నిత్యం చర్చ సాగుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి వారి ప్రశ్నలకు అస్సలు సమాధానం అన్నదే లేదు. డిజిటల్ పెట్రేగిపోవడాన్ని వ్యతిరేకించడం తప్ప దానిని పూర్తిగా నిరోధించే దమ్ము ఎవరికీ లేదని తాజా సన్నివేశం చెబుతోంది. నెట్ ఫ్లిక్స్ .. అమెజాన్ ప్రైమ్.. హాట్ స్టార్.. ఈరోస్... ఇంకా ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి డిజిటల్ దిగ్గజాలు నిరంతరం వేడెక్కించే కంటెంట్ ని వండి వార్చి డిజిటల్ లో రిలీజ్ చేస్తున్నాయి. వీటి వెంటపడే యూత్ అంతకంతకు పెరుగుతుండడంతో ఆ వంటకంలోనే బిజీ అయిపోతున్నారంతా.డిజిటల్ లో అసభ్యత.. అశ్లీలతపై నియంత్రణ ఏది? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే వాటిపై పర్యవేక్షణ- నియంత్రణ రెండిటినీ బ్యాలెన్స్ చేయాలని బాలీవుడ్ లేడీ నిర్మాత ఏక్తా కపూర్ అభిప్రాయపడ్డారు. స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలపై నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆన్ లైన్ స్ట్రీమింగ్ కి సెన్సార్ అవసరమని తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఏక్తా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టింది.  నెట్ ఫ్లిక్స్ తరహాలోనే ఓటీటీ ఫ్లాట్ ఫాం వేదికగా సినిమాల్ని అందించేందుకు ఆల్ట్ బాలాజీ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏక్త ఓ మీడియా చిట్ చాట్ లో పలు అంశాలపై సూటిగా తన మాటను చెప్పారు.

డిజిటల్ లో కంటెంట్ అదుపు తప్పుతున్న మాట నిజమే. అలాగని అడల్ట్ కంటెంట్ ని నిషేధించమనడం సరికాదు. పెద్దలకు మాత్రమే అని నిషేధిస్తూ దాని ప్రభావం చాలానే ఉంటుంది. ప్రతిచోటా మంచి చెడు ఉంటాయి. ఇక్కడా మంచి- చెడు రెండూ ఉన్నాయి. అసభ్య  అశ్లీల అడల్ట్ కంటెంట్ చిత్రాల్లో నటించే వాళ్లకు లేని ఇబ్బంది.. వాటిని చూసే వాళ్లకు లేని ఇబ్బంది సెన్సార్ కెందుకు అని ప్రశ్నించడం సంచలనమైంది. నిషేధం వద్దు.. సెన్సార్ షిప్ .. నియమాలు అవసరం. చట్టబద్దంగా ఉండే పెళ్లిలో కూడా నేరాలు జరగడం లేదా? నేరాలకు సెక్స్ కారణం కాదు అని ఏక్తా కపూర్ తెలిపారు. సుప్రీం తీర్పును గౌరవిస్తూనే నియంత్రణను ఏర్పాటు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మీరు అంతా బోల్డ్ గా ఉంటారని ప్రశ్నిస్తారు. అవును బోల్డ్ గా ఉంటాను. నాకు సెక్స్ అనే దానితో ఎలాంటి సమస్య లేదు అని ఏక్తా కపూర్ మరో సంచలన వ్యాఖ్యతో వేడెక్కించారు.