తారక్ లవర్ గా ఆ బ్యూటీ!

Wed Jul 11 2018 11:39:04 GMT+0530 (IST)

అ!! సినిమాలో ఊహించని షాకింగ్ పాత్రలో కనిపించి మెప్పించిన హీరోయిన్ ఈషా రెబ్బ దశ మెల్లగా మారుతోంది. ఐదేళ్ల క్రితమే పరిశ్రమకు వచ్చినా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈషా రెబ్బకు ఇప్పుడు అది దొరికేలా ఉంది. కారణం త్రివిక్రమ్ సినిమా ఆఫర్. అరవింద సమేత వీర రాఘవలో జూనియర్ ఎన్టీఆర్ మాజీ లవర్ గా ఈషా రెబ్బ ఓ కీలక పాత్ర చేసినట్టు సమాచారం. దాని తీరుతెన్నులు లాంటివి బయటికి చెప్పలేదు కానీ ఒక ఇంటర్వ్యూలో తారక్ ఎంత సరదాగా ఉంటాడో చెబుతూ ఈషా రెబ్బ సంబరపడిపోవడం వల్ల ఈ విషయం చూచాయగా బయటికి వచ్చింది.అత్తారింటికి దారేదిలో మెయిన్ హీరోయిన్ సమంతానే అయినప్పటికీ సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రణీతకు కూడా మంచి స్కోప్ దక్కింది. పవన్ తో ఏకంగా ఒక డ్యూయెట్ కూడా పెట్టేసి తనకు మంచి బ్రేక్ ఇచ్చాడు త్రివిక్రమ్. అదే తరహాలో ఈషా రెబ్బాకు ఇందులో కూడా ఆఫర్ చేసినట్టు టాక్. ఈషా రెబ్బ దీని కన్నా ముందు  బ్రాండ్ బాబు విడుదల కోసం ఎదురు చూస్తోంది. గ్లామర్ పాత్రకు భిన్నంగా పనిమనిషిగా నటించిన ఈషా అందులో హీరోను తన ప్రేమలో పాడేసుకునే పాత్రలో వెరైటీగా కనిపించబోతోంది. మారుతీ రచన ప్లస్ నిర్మాణం చేసిన బ్రాండ్ బాబు నెక్స్ట్ నువ్వే దర్శకుడు టీవీ యాక్టర్ ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందింది.

తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందాల్సిన ఆటా నాదే వేటా నాదేలో కూడా ఈషాకు ఆఫర్ ఇచ్చారు కానీ ఆ ప్రాజెక్ట్ ఏకంగా రద్దు కావడంతో కొంత నిరాశ చెందింది కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సరసన చేయటంతో ఆ లోటు తీరినట్టే. సుమంత్ సరసన  సుబ్రమణ్యపురం కూడా చేస్తున్న ఈషా ఈ మూడు కనక హిట్ అయితే కొన్నాళ్ల పాటు టాలీవుడ్ రేస్ లో ఉండొచ్చని ఆశ పడుతోంది. మూడు డిఫరెంట్ జానర్ సినిమాలు కాబట్టి బ్రేక్ వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.