Begin typing your search above and press return to search.

బ్యాడ్ లక్ మళ్ళీ పలకరించింది

By:  Tupaki Desk   |   8 Dec 2018 5:48 AM GMT
బ్యాడ్ లక్ మళ్ళీ పలకరించింది
X
కొందరికి అదృష్టలక్ష్మి వద్దన్నా తలుపు తడుతుంది. మరికొందరికి ఎంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కదు. హీరోయిన్ ఈషా రెబ్బా రెండో కోవ కి చెందుతుంది. చెప్పుకోవడానికి ఆరు నెలల కాలం లో మూడు సినిమాలు చేసినప్పటికీ దేని వల్లా తనకు ఆశించిన ప్రయోజనం దక్కక పోవడం పట్ల ఈ తెలుగు బ్యూటీ నిరాశలో ఉందనే చెప్పాలి. మారుతీ బ్రాండ్ ని నమ్ముకుని హీరో కొత్తవాడైనా చేసిన బ్రాండ్ బాబు డిజాస్టర్ గా మిగలడం మొదటి దెబ్బ. కథలో కీ పాయింట్ తన పాత్ర చుట్టే తిరిగినా కంటెంట్ బాగా తేడా కొట్టడంతో చేదు ఫలితం తప్పలేదు.

ఇక అరవింద సమేత వీర రాఘవ సంగతి సరేసరి. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి క్రేజీ కాంబో ఉన్నా సెకండ్ హీరోయిన్ పాత్ర కావడంతో తనకు కనీస గుర్తింపు కూడా దక్కలేదు. పేరు మొత్తం త్రివిక్రమ్ తారక్ పంచుకోవడంతో మెయిన్ లీడ్ పూజా హెగ్డేకె ఏమి దక్కనప్పుడు ఈషా మాత్రం ఏదైనా ఆశిస్తే ఎలా. ఇక నిన్న విడుదలైన సుబ్రహ్మణ్యపురం ఫలితం కూడా డివైడ్ టాక్ రూపంలోనే బయటికి వస్తోంది. కథ సంగతి పక్కన పెడితే సుమంత్ కి జోడిగా నటించడం పెద్దగా ప్లస్సయ్యేది కాదు. పైగా హీరోయిన్ పాత్ర కు ఇందు లో పెద్ద స్కోప్ కూడా దక్కలేదు. సో ఈషా కు సుబ్రహ్మణ్యపురం వల్ల వచ్చేది ఏమి లేదని అర్థమైపోయింది.

ప్రస్తుతం వస్తా నీ వెనుక అనే చిన్న సినిమా తప్ప ఈషా చేతి లో పెద్ద ఆఫర్లంటూ ఏమి లేవు. ఒడ్డు పొడవు అందం టాలెంట్ అన్ని ఉన్నా లక్ తో పాటు అవకాశాలు కలిసి రాక ఈషా రెబ్బా ఆశించనంత వేగంగా కెరీర్ ముందుకు సాగడం లేదు. గత ఏడాది అమీ తుమీ హిట్ కొట్టిన ఆనందం చల్లారే లోపే ఈ మూడు షాకులు బ్యూటీని డిఫెన్స్ లో పడేశాయి. మరి కోరుకున్న బ్రేక్ ఇక ముందైనా దక్కుతుందో లేదో వేచి చూడాలి.