Begin typing your search above and press return to search.

ఈ సినిమాకు ఏమైంది

By:  Tupaki Desk   |   13 Jun 2018 6:57 AM GMT
ఈ సినిమాకు ఏమైంది
X
పెళ్లి చూపులు లాంటి కూల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల మెప్పుతో పాటు బాక్స్ ఆఫీస్ వసూళ్లు కూడా దక్కించుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ కొత్త సినిమా ఈ నగరానికి ఏమైంది హైప్ అంతగా కనిపించడం లేదు. ట్రైలర్ తక్కువ టైంలోనే మిలియన్ వ్యూస్ దక్కించుకున్నా ఆశించినంత స్పందన సోషల్ మీడియాలో కూడా లేదనే చెప్పాలి. కొత్త ఆర్టిస్టులతో తరుణ్ చేస్తున్న ప్రయోగం సాధారణ ప్రేక్షకులకు ఎంత మాత్రం కనెక్ట్ అవుతుందన్న అనుమానం ట్రైలర్ ఒకరకంగా బలపరిచింది. పెళ్లి చూపులు కమర్షియల్ సక్సెస్ కావడంలో యూత్ కన్నా ఎక్కువగా ఫామిలీ ఆడియన్స్ కీ రోల్ ప్లే చేసారు. ఎ సెంటర్స్ దక్కిన విపరీతమైన ఆదరణ దాన్ని సూపర్ హిట్ క్యాటగిరీలోకి మార్చేశాయి. ప్రతి సారి అదే మేజిక్ జరుగుతుందని ఆశించలేం. కానీ తరుణ్ భాస్కర్ దానికి పూర్తి భిన్నంగా అనిపించే జానర్ ను సెలెక్ట్ చేసుకోవడం ఆసక్తి రేపుతున్నప్పటికీ అది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అన్నది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.

జీవితంలో ఏవేవో లక్ష్యాలు పెట్టుకున్న నలుగురు కుర్రాళ్ళ మధ్య అర్బన్ లైఫ్ ని ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ముడిపెట్టి చెప్పడం అనేది మరీ కొత్తదనం కాకపోయినా చెప్పే విధానాన్ని బట్టి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆధారపడి ఉంటుంది. పెళ్లి చూపుల తరహాలోనే నిర్మాత సురేష్ బాబు దీనికి దన్నుగా ఉన్నప్పటికీ అది కేవలం ధియేటర్లను తెచ్చుకోవడంలో ఉపయోగపడుతుంది తప్ప సినిమాను లాంగ్ రన్ వైపు నడిపించేందుకు కాదు. సో రెండేళ్ల గ్యాప్ తర్వాత తరుణ్ భాస్కర్ చేస్తున్న ఈ ఎక్స్ పెరిమెంట్ సక్సెస్ కావడం పూర్తిగా అతని భుజాల మీదే ఉంది. యాక్టర్స్ అందరు దాదాపు కొత్త వాళ్లే కావడంతో ఓపెనింగ్స్ విషయంలో వాళ్ల్లు చేసేదేం ఉండదు. సురేష్ బ్యానర్ ప్లస్ తరుణ్ భాస్కర్ ఇమేజ్ ఈ రెండే ఇక్కడ పని చేస్తాయి. మరి ఈ నగరానికి ఏమైంది అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్నప్పుడు సినిమాని జనంలోకి తీసుకెళ్లే విషయంలో మాత్రం నార్మల్ గా ఉండటం ఎలా అర్థం చేసుకోగలం. అందుకే ఈ సినిమాకు ఏమైంది ఈ సినిమాలో ఏముంది అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.