Begin typing your search above and press return to search.

ఈ వారసుడి సినిమాను బ్యాన్‌ చేయాలట!

By:  Tupaki Desk   |   22 Sep 2018 7:11 AM GMT
ఈ వారసుడి సినిమాను బ్యాన్‌ చేయాలట!
X
సినిమా పరిశ్రమలో వారసుల పరిచయం అనేది చాలా కామన్‌గా జరుగుతూనే ఉంది. నెలకు ఇద్దరు, ముగ్గురు ప్రేక్షకులకు పరిచయం అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుర్రాడు రాహుల్‌ విజయ్‌. ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ తనయుడు అయిన రాహుల్‌ విజయ్‌ ‘ఈమాయ పేరేమిటో’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. విజయ్‌ వారసుడు అవ్వడంతో అందరి దృష్టి ఈ చిత్రం ఆకర్షించింది. సినిమాకు భారీగా పబ్లిసిటీ చేసి నిన్న శుక్రవారం ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. నిన్న విడుదలైన ఈ చిత్రంను బ్యాన్‌ చేయాల్సిందే అంటూ జైన మతస్థులు థియేటర్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారు.

సినిమాలో జైన మతంను కించపర్చే విధంగా సన్నివేశాలు ఉన్నాయి అంటూ సదరు మతస్తులు ఆందోళనలు చేస్తున్నారు. సినిమా టైటిల్‌ సాంగ్‌ లో జైన మతంకు సంబంధించిన మంత్రం ఉందట. ఆ మంత్రం వచ్చే సమయంలో విజువల్స్‌ వివాదాస్పదంగా ఉన్నాయి. అందుకే సినిమాను వెంటనే నిలిపేయాలని థియేటర్ల వద్ద జైన మతస్థులు ఆందోళనలు చేస్తున్నారు. సినిమాను వెంటనే నిలిపేయకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టు వరకు వెళ్తామని జైన మత పెద్దలు చిత్ర యూనిట్‌ సభ్యులను హెచ్చరిస్తున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రను దర్శకుడు జైన మతస్థురాలిగా చూపించాడు. హీరోయిన్‌కు ఈ చిత్రంలో శీతల్‌ జైన్‌ అంటూ పెట్టడం జరిగింది. హీరో శ్రీరామ చంద్రమూర్తి. వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన కొన్ని సీన్స్‌ తమ మతంను కించపర్చే విధంగా ఉన్నాయి అంటూ జైన మతస్తులు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు.

పాట వివాదాస్పదం అయిన నేపథ్యంలో నిర్మాత దివ్య విజయ్‌ ఆ పదాన్ని మ్యూట్‌ చేసినట్లుగా చెబుతున్నారు. అయినా కూడా తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, తన ఫోన్‌ నెంబర్‌ ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు అంటూ నిర్మాత దివ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి అభ్యంతరంగా ఉన్న పదాలను తొలగించినా కూడా సినిమాను ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ కూతురే ఈ దివ్య విజయ్‌ అనే విషయం తెల్సిందే.