Begin typing your search above and press return to search.

దోమకొండ సంస్థానం కోసం రాంచరణ్ మామ ఫైట్

By:  Tupaki Desk   |   14 Jun 2018 10:29 AM GMT
దోమకొండ సంస్థానం కోసం రాంచరణ్ మామ ఫైట్
X
పూర్వపు నిజామాబాద్ జిల్లా.. స్వాతంత్య్రానికి పూర్వం ఈ జిల్లాలో పలు సంస్థానాలు ఉండేవి. నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ కేంద్రంగా కామినేని వంశీయులు శతాబ్ధాలపాటు పరిపాలించారు. కోటలు - గడీలు - ప్రఖ్యాత కట్టడాలు - బంగ్లాలు కట్టించి తమదైన ముద్ర వేశారు. స్వాతంత్ర్యం అనంతరం భారత ప్రభుత్వం ఈ సంస్థానాలను రద్దు చేసింది. దీంతో ఆ విలువైన ఆస్తులు అలానే బూజు పట్టిపోయాయి. సంస్థానాలను ఏలిన వారందరూ వలసపోయారు.ఇప్పటికీ దోమకొండను పాలించిన పలు వంశాల వారసులు హైదరాబాద్ లో ఉంటున్నారు. వ్యాపారులు ఇతర వ్యాపకాల్లో బాగానే సంపాదిస్తున్నారు. అక్కడికి కట్ చేస్తే..

2013లో సినీ నటుడు రాంచరణ్ తేజ్ -ఉపాసన వివాహా ముందస్తు వేడుకలు దోమకొండ కోటలో ఘనంగా నిర్వహించారు. రాంచరణ్ మామ అనిల్ కామినేని దోమకొండ కోటను రిపైర్ చేయించి అంగరంగ వైభవంగా ఈ వేడుకను చేశారు. దీనికి అప్పట్లో కేంద్రమంత్రిగా యూపీఏ ప్రభుత్వం లో ఉన్న చిరంజీవి పూర్తి సహకారం అందించారు. అధికారులు - పోలీసులు కూడా కోటను అనిల్ కామినేని పరం చేశారు. కోటను ఆ తర్వాత నివాసానికి అనుగుణంగా సర్వాంగ సుందరంగా మార్చారు. కోటలో అనిల్ కామినేని సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయించి ఎవరూ ప్రవేశించకుండా తన ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈ కోట పూర్తిగా అనిల్ కామినేని వశం కావడంతో ఇతర వారసులైన రాజేశ్వరరావు - సత్యనారాయణ రావ్ - రాజేశ్వర్ భూపాల్ - లావణ్య కుటుంబాలు స్థానిక కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఆస్తుల విషయంలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి రాములును విచారణ అధికారిగా నియమించారు. పంచాయతీ అధికారులు విచారణ జరిపినా తేలలేదు. దీంతో ఈ నెల 9న కామినేని వారసులందరూ కోటలోకి ప్రవేశించి తాళాలు వేశారు. ఇవి తమ ఆస్తులని పేర్కొంటూ బోర్డులు పెట్టారు.

దీంతో ఇన్నాళ్లు కోట తనది అని సెక్యూరిటీ పెట్టించిన అనిల్ కామినేని పోలీసులను ఆశ్రయించాడు. కోటలోకి అక్రమంగా ప్రవేశించి భవనాలకు తాళాలు వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదైంది. అనిల్ కామినేని కోట తాళాలు పగుల కొట్టించడంతో అతడిపై రాజేశ్వరరావు - సత్యనారాయణ రావ్ - రాజేశ్వర్ భూపాల్ - లావణ్య లు కూడా తిరిగి కేసు పెట్టారు. ఇలా పరస్పర ఫిర్యాదులు - గొడవలతో కామినేని కుటుంబాల ఆస్తుల గొడవ రచ్చకెక్కింది.