Begin typing your search above and press return to search.

కిర‌ణ్‌ కుమార్ రెడ్డి అవినీతి 10వేల కోట్లు!

By:  Tupaki Desk   |   14 July 2018 5:33 AM GMT
కిర‌ణ్‌ కుమార్ రెడ్డి అవినీతి 10వేల కోట్లు!
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి న‌ల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్వంతగూటికి చేరిన స‌మ‌యంలోనే ఆయ‌నపై సంచ‌ల‌న ఆరోప‌ణ వెలుగులోకి వ‌చ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందని ఆరోపిస్తూ పార్టీ వీడిన మాజీ సీఎం.. మళ్లీ అదే పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలో శుక్రవారం కిరణ్‌ కుమార్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ లోకి చేరారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన నివాసంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డికి పార్టీ కండువాకప్పి సాదరంగా స్వాగతించారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి వెంట ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ చార్జి ఊమెన్‌ చాందీ - ఆ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి తదితరులున్నారు. అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టం హామీలను అమలు చేయడంలో ప్రస్తుత కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని - కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీ - తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తిరిగి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ ను - తనను వీడదీయలేరని అన్నారు. కాంగ్రెస్‌ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఇలా త‌న రీ ఎంట్రీపై కిర‌ణ్ కుమార్ రెడ్డి సంతోషం వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న ఏలుబ‌డిలో భారీ అవినీతి జ‌రిగింది అప్ప‌టి మంత్రి వ‌ర్గంలోని నాయ‌కుడు వెల్ల‌డించారు. రూ.10,000 కోట్ల అవినీతికి కిర‌ణ్‌ కుమార్ రెడ్డి పాల్ప‌డ్డార‌ని సంచ‌ల‌న ఆరోప‌న చేశారు. అలా క‌ల‌క‌లం సృష్టించే ఆరోప‌ణ చేసింది మాజీ కాంగ్రెస్ నేత‌ - ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్రసాద్‌. ఓ టీవీ చాన‌ల్‌ లైవ్ డిబేట్ లో డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 10వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అవినీతిపై గ‌తంలోనే తాను గవర్నర్ నరసింహన్ కి పిర్యాదు చేస్తే 10వేల కోట్లు కాదు 3వేల కోట్లు చేశాడని గవర్నర్ స్వయానా నాతో అన్నారని డొక్కా క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. భార‌త‌దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుడు - అవినీతిప‌రుడు - ముఖ్య‌మంత్రిగా రాష్ర్టాన్ని దోచుకున్నాడు అని ఆయ‌న విమ‌ర్శించారు. కిర‌ణ్ కుమార్ రెడ్డి అవినీతిపై తాను గవర్నర్‌ కు - కాంగ్రెస్ అధిష్టాన‌మైన ఏఐసీసీకి రాసిన లేఖలు భయటపెడతాన‌ని డొక్కా వెల్ల‌డించారు.

విభజన సమయంలో తల్లి లాంటి కాంగ్రెస్‌ ని చంపి - ఇప్పుడు కాపాడతానని పార్టీ లో చేరడం విడ్డూరమ‌ని మాజీ మంత్రి - టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. కిర‌ణ్ కుమార్ రెడ్డి చేరిక‌తో ఒరిగేదేమీ లేద‌న్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ కు అదనంగా ఒక్క ఓటు వచ్చిందని సెటైర్లు వేశారు. కిరణ్ చేరికతో కాంగ్రెస్ కు ఒక్క ఓటు పెరగడం మినహా ఎలాంటి లాభం లేదన్న డొక్కా... దేశంలో అత్యంత ధనికుడైన రాజకీయ నేత కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.