'మా' లో విభేధాలు లేవ్.. మేమే చెబుతాం

Wed Sep 11 2019 17:23:49 GMT+0530 (IST)

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో లుకలుకలు.. అధ్యక్షుడు నరేష్ కి షోకాజ్ నోటీస్!! అంటూ నేటి ఉదయం నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. మా ప్రస్తుత అధ్యక్షుడిపై ఈసీ కార్యవర్గం సీరియస్ గా ఉన్నారని.. ఆయన పర్సనల్ పనుల్లో ఉండడంతో `మా`ను పట్టించుకునేంత తీరిక లేదని  ప్రచారమైంది. ఆర్టిస్టుల సొంత భవంతి నిర్మాణం కోసం నిధి సేకరణ కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చిన కొత్త అధ్యక్షుడు పత్తా లేకుండా పోయారన్న ఆవేదనా వ్యక్తమైంది. ముఖ్యంగా రాజశేఖర్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో ఈ లుకలుకలపై ఆరా తీసిన కొన్ని మీడియాల్లో మా లుకలుకల వ్యవహారం బయటపడింది.అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై `మా` కార్యవర్గం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ``మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కార్యవర్గంలో భేదాభిప్రాయాలు వచ్చాయని.. అధ్యక్షుడు నరేశ్ కి రాజశేఖర్ కార్యవర్గం నోటీసులు ఇవ్వబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన `మా` కార్యనిర్వాహక వర్గం ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తోంది!`` అంటూ మీడియాకి ఓ ప్రెస్ నోట్ ని పంపించారు. ``ఓ అసోసియేషన్ అంటే.. చాలా సమస్యలుంటాయి. వాటన్నింటినీపై అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది`` అని స్పష్టతనిచ్చారు.

`మా` వెల్ఫేర్ కి సంబంధించి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించి మీడియాకు తెలియజేయాల్సినవి ఏవైనా ఉంటే అధికారికంగా మేమే తెలియజేస్తామని మా అసోసియేషన్ కార్యవర్గం తెలియజేసింది.