Begin typing your search above and press return to search.

సావిత్రి కులం తేల్చేందుకు ఇంత ఆరాట‌మా?

By:  Tupaki Desk   |   15 May 2018 4:53 AM GMT
సావిత్రి కులం తేల్చేందుకు ఇంత ఆరాట‌మా?
X
అదేం క‌ర్మో.. మ‌రెవ‌రికీ లేని చిత్ర‌మైన జ‌బ్బు తెలుగోళ్ల‌కు ఉంది. అందునా ఆంధ్రా ప్రాంతం వారికి మ‌రింత ఎక్కువ‌. ఇంకాస్త డీప్ గా వెళితే.. కోస్తా ప్రాంతంలో వారికి ఇంకాస్త ఎక్కువ‌. ప‌రిచ‌య‌మైన ప‌ది నిమిషాల్లోనే మీ కుల‌మేమిటంటూ ఓపెన్ గా అడిగేస్తారు. కులాల పంచాయితీలు పెద్ద‌గా ప‌ట్టించుకోని ప్రాంతం నుంచి వ‌చ్చిన వారు కానీ.. వేరే రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారికి ఈ కులాల మీద ఆస‌క్తి ఏంటో ఒక ప‌ట్టాన అర్థం కాదు.

ఎక్క‌డిదాకానో ఎందుకు కోస్తాతో పోల్చిన‌ప్పుడు తెలంగాణ‌లో ఏ ప్రాంతంలోనూ కులాల‌కు పెద్ద‌గా వాక‌బు చేయ‌టం ఉండ‌దు. ఈ మ‌ధ్య‌నే తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంద‌రిలో ఈ కులం గురించి తెలుసుకోవాల‌న్న ద‌రిద్రపు యావ పెరుగుతోంది. సామాన్యుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కూ ఇదే ధోర‌ణి. ఇది అంత‌కంత‌కూ పెరుగుతోందే త‌ప్పించి త‌గ్గ‌ని ప‌రిస్థితి.

కులం కూడు పెట్ట‌ద‌న్న విష‌యం తెలిసినా.. ఏ కుల‌పోడో తెలుసుకుంటే వ‌చ్చే ఆనందం అంతా ఇంతా కాద‌న్న‌ట్లుగా తెలుగువారు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఈ విష‌యంలో కోస్తా వాళ్ల‌ను కొట్టేటోళ్లు మ‌రెవ‌రూ క‌నిపించ‌రు. ఆ మ‌ధ్య‌న ఒలింపిక్స్ లో బంగారు ప‌త‌కం సాధించుకొని వ‌చ్చిన సింధును అంద‌రూ అభినందిస్తే.. తెలుగోళ్లు మాత్రం సింధు కులం ఏమిటో తేల్చే ప‌నిలో బిజీ అయిపోయారు. ఇలా ప్ర‌ముఖంగా ఏ పేరు క‌నిపించినా.. వెంట‌నే స‌ద‌రు వ్య‌క్తుల కులం వివ‌రాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌టం.. గూగుల‌మ్మ‌ను సాయం చేయ‌మ‌ని అడ‌గ‌టం క‌నిపిస్తుంది.

సెల‌బ్రిటీలుగా మారినోళ్ల కులం గురించి తెలుసుకునే విష‌యంలో ప్ర‌ద‌ర్శించే ఆస‌క్తికి నిద‌ర్శ‌నంగానే.. ఆ మ‌ధ్య ముగిసిన బిగ్ బాస్ షో విజేత శివ‌బాలాజీ కులం ఏమిటి? బిగ్ బాస్ లో త‌న మాట‌ల‌తో అల‌రించిన హ‌రితేజ కులం లెక్క‌లు తేల్చేందుకు ఎవ‌రికి వారు ప‌డిన తాప‌త్ర‌యంఅంతా ఇంతా కాదు. అయినా.. జ‌రిగిపోయిన ముచ్చ‌ట్లు ఇప్పుడు ఎందుకంటారా? ఇక్క‌డే ఉంది అస‌లు పాయింట్‌. అప్పుడెప్పుడో నాలుగు ద‌శాబ్దాల క్రితం తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయిన మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ పుణ్య‌మా అని మ‌రోసారి కులాల పంచాయితీ తెర మీద‌కు వ‌చ్చింది. మ‌హాన‌టిగా అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన సావిత్రికి సంబంధించిన స‌రికొత్త సందేహం ఒక‌టి ఇప్పుడు తెలుగోళ్ల‌కు వ‌చ్చింది. ఆమెది ఏ కులం అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.

మ‌హాన‌టి విడుద‌ల‌య్యాక తెలుగోళ్ల‌కు వ‌చ్చిన పెద్ద సందేహం సావిత్రి కులం ఏమిటి? అనే. సినిమా చూసిన చాలామంది సావిత్రి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన‌దిగా క‌న్ఫ‌ర్మ్ చేశారు. కాదంటేకాదు.. ఆమె కాపు అంటూ మ‌రో వ‌ర్గం కొత్త విశ్లేష‌ణ‌ను తీసింది. సావిత్రి కులం ఏమిటో తేల్చేందుకు పెద్ద ఎత్తున రీసెర్చే చేశారు. కోమాలోకి జారే నాటికి ఆమెను ఆద‌రించేందుకు అక్క‌ర‌కు రాని కులం.. ఆమె మ‌ర‌ణించిన ఇన్నాళ్ల‌కు చ‌ర్చ‌కు రావ‌టం చూస్తే.. తెలుగోళ్ల‌కున్న కులం ద‌రిద్రం ఎంత పీక్స్ కు చేరిందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

సావిత్రి త‌ల్లిదండ్రుల ఇంటిపేరు నిశ్శంక‌రం (తండ్రి నిశ్శంక‌రం గుర‌వ‌య్య‌.. త‌ల్లి సుభ‌ద్ర‌మ్మ‌). అంటే.. కాపులు. మ‌రి.. క‌మ్మ మాట ఎందుకు వ‌చ్చింది? అన్న‌ది ప్ర‌శ్న‌. దీనికి కార‌ణం లేక‌పోలేదు. సినిమాలో సావిత్రిని చేర‌దీసి.. ఆమెకు సినిమా అవ‌కాశాల కోసం త‌పించే పాత్ర‌లో క‌నిపించే పాత్ర పేరు చివ‌ర చౌద‌రిగారు క‌నిపించినంత‌నే సావిత్రిని క‌మ్మ ఖాతాలో వేసేశారు. త‌ల్లిదండ్రులు కాపులైతే.. బాబాయ్ క‌మ్మ ఎలా? అదే.. ట్విస్ట్‌. అదెలానంటే.. సావిత్రి పెద్ద‌మ్మ‌ది ప్రేమ వివాహం. ఆమె చౌద‌రిని ప్రేమించి పెళ్లాడింది. దీంతో.. చిన్న‌పాటి క‌న్ఫ్యూజ‌న్. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సావిత్రి ప్రేమించి పెళ్లాడింది త‌మిళ బ్రాహ్మ‌ణుడ్ని. మొత్తంగా చూస్తే.. ఇప్పుడు గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చించుకుంటున్న కులాలు ఏవీ సావిత్రికి సాయంగా నిల‌వ‌లేవ‌ని. అయినా.. కులాల మీద ఈ ద‌రిద్ర‌పు చ‌ర్చేంటో?