అంగీకారంతో వెళితే క్యాస్టింగ్ కౌచ్ కాదట!

Fri Aug 17 2018 17:07:14 GMT+0530 (IST)

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం అంటూ నటి శ్రీరెడ్డి చేసిన హంగామా ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఫిలిం చాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసిన విధానంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీరెడ్డి ఉదంతం వల్ల ఇండస్ట్రీలో ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతిందని కొందరు విమర్శించారు. ఆ తర్వాత శ్రీరెడ్డి వ్యవహార శైలి పలు మలుపులు తిరగడంతో ...ఆమెపై ఉన్న కొద్దో గొప్పో కర్టసీని కోల్పోయింది. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై పలువురు టాలీవుడ్ నటీమణులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై నటి డిస్కో శాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేరొకరితో శృంగారం జరిపేందుకు అంగీకారంతో వెళ్లినపుడు అది క్యాస్టింగ్ కౌచ్ కాదని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.క్యాస్టింగ్ కౌచ్ అనేది దాదాపుగా అన్ని రంగాల్లో ఉందని అయితే ఎవరైనా...తమ అంగీకారంతోనే సెక్స్ చేస్తే అది క్యాస్టింగ్ కౌచ్ కాదని డిస్కో శాంతి అన్నారు. వారు రేప్ కు గురి కాలేదని పూర్తి అంగీరంతో వేరొకరితో సెక్స్ లో పాల్గొన్నపుడు అది క్యాస్టింగ్ కౌచ్ కాదని అన్నారు. అయితే తన దగ్గరకు క్యాస్టింగ్ కౌచ్ ప్రపోజల్ తీసుకువచ్చేంత ధైర్యం ఎవరూ చేయలేదని తెలిపారు. ఒకవేళ తమ దగ్గరకు అటువంటి ఆలోచనలతో ఎవరన్నా వస్తే.....వారి చెంప పగలగొట్టాలని అన్నారు. అయితే శ్రీరెడ్డి వంటి వారు పాపులారిటీ కోసం ఇలా చేస్తుంటారని మీడియాలో హైలైట్ కావడం ద్వారా విపరీతమైన పబ్లిసిటీ సొంతం చేసుకోవడమే వారి ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు.