Begin typing your search above and press return to search.

ముందుకొచ్చి మహేష్ తప్పు చేశాడా?

By:  Tupaki Desk   |   24 Feb 2018 9:43 AM GMT
ముందుకొచ్చి మహేష్ తప్పు చేశాడా?
X
మొత్తానికి ఏప్రిల్ చివరి వారం సినిమాల లెక్క తేలిపోయింది. 27వ తేదీ కోసం మొండి పట్టుతో ఉన్న ‘భరత్ అనే నేను’.. ‘నా పేరు సూర్య’ సినిమాలు ఆ తేదీని విడిచిపెట్టాయి. ‘భరత్ అనే నేను’ వారం ముందుకొస్తే.. ‘నా పేరు సూర్య’ వారం వెనక్కి వెళ్లింది. మరి వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనం పొందినట్లు..? ఏది నష్టపోతున్నట్లు అనే చర్చ మొదలైంది. నిజానికి ‘నా పేరు సూర్య’నే ముందు మొదలై.. ముందు డేట్ ఇచ్చింది కాబట్టి.. ముందుకా వెనక్కా అనే ప్రశ్న తలెత్తినపుడు ఆ సినిమానే ముందుకు రావాలి. కానీ ఆ ఆప్షన్ ‘భరత్ అనే నేను’ తీసుకుంది. మే నెలలో రిలీజైన మహేష్ సినిమాలేవీ ఆడిన చరిత్ర లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20కి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

కానీ ఇది అంత తెలివైన నిర్ణయం కాదేమో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా వారం రోజుల తర్వాత రజినీ సినిమా ‘కాలా’ వస్తోంది కాబట్టి ఆ ప్రభావం దీనిపై ఎక్కువే పడుతుంది. ‘కాలా’ మీద ఇప్పుడు అంత బజ్ లేదు కానీ.. రజినీ సినిమా అన్నాక ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేస్తోంది. అది భారీ స్థాయిలో విడుదలవుతుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ‘భరత్ అనే నేను’ ఎంత వసూలు చేసుకున్నా అది తొలి వారంలోనే అన్నమాట. ఈ సినిమాకు టాక్ తేడా వస్తే మాత్రం అంతే సంగతులు. వీకెండ్ తర్వాత బండి నడవడం కష్టమవుతుంది. వరుసగా ‘కాలా’.. ‘నా పేరు సూర్య’ వస్తాయి కాబట్టి రెండో వారం నుంచి కలెక్షన్లపై పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి ఉండదు. ఐతే మే 4న రావడం వల్ల ‘నా పేరు సూర్య’కు అడ్వాంటేజ్ ఉంది. అప్పటికి ‘కాలా’ సందడి తగ్గుతుంది. తర్వాతి వారంలో రాబోయేది బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘సాక్ష్యం’ కాబట్టి దాని ఎఫెక్ట్ దీనిపై పెద్దగా ఉండదు. ఆ రకంగా ఏప్రిల్ 20న రావడం వల్ల మహేష్ అడ్వాంటేజీ కోల్పోతున్నట్లే.