పైరసీ అతన్ని ఏడిపించేసింది

Sun Jan 14 2018 10:48:40 GMT+0530 (IST)

సినిమాల పాలిట మృత్యువులా దాపురించిన పైరసీ భూతం రోజు రోజుకి తన వికృత రూపాన్ని పెద్దది చేసుకుంటూ హద్దులు దాటుతోంది. ఎన్ని చర్యలు చేపట్టినా ఎన్ని చట్టాలు ఉపయోగించినా  వీటిలో మార్పులు కాదు కదా కొత్త కొత్త దారులు వెతుక్కుని మరీ నాట్యం చేస్తోంది. తమ సినిమాలు విడుదలైనప్పుడు హీరోలు దర్శకులు ఎంత విజ్ఞప్తులు చేస్తున్నా వదలకుండా చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. అవకాశం ఉంది కాబట్టి చూస్తున్నాం కట్టడి చేయండి ఆప్షన్ ఉండదు కాబట్టి థియేటర్ కు వచ్చి చూస్తాం అన్న వాళ్ళ వాదన కూడా కొట్టి పారేయలేం కాబట్టి ప్రభుత్వాలు దీని గురించి చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .తాజాగా విడుదలైన తమిళ సినిమా తానా సేరంద్ర కూట్టం(తెలుగు ‘గ్యాంగ్)దర్శకుడు విజ్ఞేశ్ శివన్ దీని గురించి తమిళ రాకర్స్ అనే వెబ్ సైట్ కు ఏకంగా మెసేజ్ పెట్టాడు. తమ ఎన్నో ఏళ్ళ కృషి ఫలితం డబ్బు కష్టాన్ని ఇలా బజారు పాలు చేయొద్దని వేడుకున్న విజ్ఞేశ్ మనసు అనేది మీలోను ఉంటె కాస్త వాడండి అంటూ రిక్వెస్ట్ చేసాడు. దీనికి కారణం ఈ సినిమా టాక్ పూర్తిగా బయటికి రాక ముందే పైరసీ వెర్షన్ ని సాయంత్రానికే వెబ్ సైట్ లో పెట్టేసారు . విపరీతమైన పోటీ వల్ల ఇప్పటికే సతమతమవుతున్న ఈ మూవీకి దీని వల్ల భారీ నష్టమే జరిగింది. పైరసీ ప్రభావం వసూళ్ళపై స్పష్టంగా కనిపించడం మొదలైంది.

విజ్ఞేశ్ శివన్ ఎంత హృద్యంగా వేడుకున్నా ఇది సమిసిపోయే సమస్య కాదు. చట్టాలు కఠినంగా అమలు చేసి భయపడే స్థాయిలో పైరసీకారులకు శిక్షలు వేస్తే తప్ప వీటికి అడ్డుకట్ట పడటం అసాధ్యం. పరిశ్రమలోని దర్శక నిర్మాతలు సైతం తమ సినిమా విడుదలైనప్పుడు మాత్రమే కాకుండా ఏ సినిమా వచ్చినా పైరసీకి వ్యతిరేకంగా ఒకే తాటి పైకి వచ్చి ఒక టీం లాంటిది సెటప్ చేసుకుని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తే బెటర్. లేకపోతే నెలరోజులకే అమెజాన్ ప్రైమ్ లో అధికారికంగా ప్రసారం అవుతున్న కొత్త సినిమాలు భవిష్యత్తులో వారం రోజులకే వచ్చే పరిస్థితి రావొచ్చు