మణిశర్మ కాదు.. వంశీనే వినిపిస్తున్నాడు

Fri May 19 2017 17:00:05 GMT+0530 (IST)

కొందరు దర్శకులుంటారు. వాళ్ల సినిమాలో అణువనువునా వాళ్ల ముద్ర కనిపిస్తుంది. ఆ సినిమాలకు ఎవరు కెమెరామన్ అయినా దృశ్యం ఒకేలా ఉంటుంది. ఎవరు సంగీతాన్నందించినా.. పాటలు ఒక టైపులో అనిపిస్తాయి. ఇలా అన్నింట్లోనూ తనదైన ముద్ర ఉండేలా చూసుకునే దర్శకుడు వంశీ. ఆయన సినిమాలంటే అదో రకం. వంశీ స్టైలే వేరు. ఒకప్పుడు వంశీకి ఇళయరాజా ఆస్థాన సంగీత దర్శకుడు. ఐతే వంశీ ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించే సమయానికి ఇళయరాజా అందుబాటులో లేరు. దీంతో చక్రి లైన్లోకి వచ్చాడు. ఐతే అతడి పాటలు విన్నా.. ఇళయరాజా పాటలు విన్నట్లే ఉంటాయి. వాటిలో వంశీ టేస్టు క్లియర్ గా తెలుస్తుంది.

ఐతే చక్రి కొన్నేళ్ల కిందటే చనిపోయాడు. అతను లేకుండా వంశీ మొదలుపెట్టిన సినిమా ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’. ఈ చిత్రానికి సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ ఇచ్చాడు. ఒక్కో పాట రిలీజ్ చేస్తూ.. చివరగా ఆడియోను నేరుగా మార్కెట్లోకి తెచ్చాడు నిర్మాత మధుర శ్రీధర్. ఈ పాటలు వింటే మణిశర్మ కంటే వంశీ ముద్రే స్పష్టంగా వినిపిస్తుంది. అన్ని పాటల్లోనూ తెలుగుదనం.. చక్కటి లిరిక్స్.. మెలోడియస్ ట్యూన్స్.. మొత్తంగా వంశీ స్టయిల్లో మణిశర్మ మంచి ఆడియోనే ఇచ్చాడు మణిశర్మ. పాపి కొండల్లో.. రవివర్మ చిత్రమా.. కనులేమిటో.. పాటలు వినడానికి శ్రావ్యంగా ఉన్నాయి. మిగతా రెండు పాటలు కూడా పర్వాలేదు. పాటలన్నింట్లో వంశీ మార్కు గోదావరి టచ్ తెలుస్తోంది. వంశీ గత సినిమాలతో పోలిస్తే ‘ఫ్యాషన్ డిజైనర్’ మీద జనాల్లో ఆసక్తి కలగడానికి ఈ ఆడియో ఒక కారణమవుతోందనడంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/