Begin typing your search above and press return to search.

తన జీవితంలోని ఆ విషాదం గురించి తేజ...

By:  Tupaki Desk   |   20 Aug 2017 5:30 PM GMT
తన జీవితంలోని ఆ విషాదం గురించి తేజ...
X
ఎన్ని డబ్బులుంటే ఏం లాభం.. కొన్ని జబ్బుల్ని నయం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి స్థితిలో ఏం చేసినా.. ఎంత ఖర్చు పెట్టుకున్నా లాభం ఉండదు. అయిన వాళ్లను కోల్పోవాల్సి వస్తుంది. తాను అలాంటి విషాదాన్నే ఎదుర్కొన్నట్లు చెప్పాడు దర్శకుడు తేజ. ఆయన చిన్న కొడుకు ఔరవ్ నాలుగేళ్ల వయసులో చనిపోయాడు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న బాధ అలాంటిలాంటిది కాదంటున్నాడు తేజ. ఎన్ని దేశాలు తిరిగినా.. ఎంతమంది వైద్యుల్ని సంప్రదించినా కొడుకును కాపాడుకోలేకపోయానంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు.

‘‘2008 నుంచి 2012 వరకు నేను ఏమీ చేయలేదు. సినిమాల జోలికి వెళ్లలేదు. మా చిన్నబ్బాయి ఔరవ్ జబ్బు పడ్డాడు. వాడి వైద్యం కోసం దేశదేశాలు తిరిగాం. కానీ వాడు మాకు దక్కలేదు. అప్పుడు నేను చాలా అప్సెట్ అయిపోయాను. దాన్నుంచి బయటికి వచ్చేసరికి చాలా సమయం పట్టింది. నాకు పిల్లలు - మొక్కలు - జంతువులు - ప్రకృతి ఇష్టం. నాకు ఎంతో ఇష్టమైన కొడుకును కోల్పోయాను. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుని.. పుంజుకుని సినిమాలు చేస్తున్నా’’ అని తేజ చెప్పాడు. ఇక తన కుటుంబంలోని మిగతా సభ్యుల గురించి తేజ చెబుతూ.. తన భార్య శ్రీవల్లి ఆర్గానిక్ ఫుడ్ పండిస్తూ ఉంటుందని.. పాండిచ్చేరి అరవింద మహర్షి భక్తురాలని.. పెద్దబ్బాయి అమితవ్ తేజ న్యూయార్క్‌ లో ఉంటున్నాడని.. అతను స్టాండప్ కామెడీల్లాంటివి చేస్తుంటాడని.. పదహారేళ్లకే అమెరికాకు వెళ్లి తన కాళ్లమీద తాను నిలబడి, చదువుకునే ప్రయత్నం చేస్తున్నాడని.. తన కూతురు ఐల వయసు 16 ఏళ్లని.. తను ఇక్కడే చదువుకుంటోందని, ఆమె బహుముఖ ప్రజ్నాశాలి అని.. తనకు కర్ణాటక - పాశ్చాత్య సంగీతంతో పాటు పియోనో, గిటార్, వయొలిన్ వాయించడం, బొమ్మలు గీయడం వచ్చని తెలిపాడు తేజ.