రివ్యూల మీద ఈసారి తేజ పంచ్ లు

Sun Aug 13 2017 12:28:48 GMT+0530 (IST)

రివ్యూ రైటర్లకు మా చెడ్డ కాలంగా మారింది. సినిమాను విమర్శనాత్మకంగా చూసి.. ప్రేక్షకులకు సినిమా వివరాల్ని అందించటం.. అందులోని మంచి చెడ్డల గురించి లాజిక్ గా మాట్లాడటం లాంటివి రివ్యూలో కామన్. అయితే.. విమర్శను స్వీకరించటానికి సినిమా వాళ్లు సిద్ధంగా లేరన్న మాట రివ్యూ రైటర్ల నుంచి.. సినిమాను రివ్యూ చేయటంలో ఈ మధ్యన రివ్యూ రైటర్లు సరిగా వ్యవహరించటం లేదన్న మాటను చిత్ర పరిశ్రమకు చెందిన వారు వ్యాఖ్యానిస్తుండటం కనిపిస్తుంది.  ఏమైనా.. రివ్యూ రైటర్ల మీద సినిమావాళ్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం ఈ మధ్యన మామూలైంది.ఈ మధ్యన వచ్చిన దువ్వాడ జగన్నాథం మూవీకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన కారణంతో సమీక్షలపై దర్వకుడు హరీశ్ శంకర్.. హీరో బన్నీలు విమర్శలు చేయటం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో చేరిపోయారు సీనియర్ దర్శకులు తేజా కూడా.

తన లేటెస్ట్ మూవీ నేనే రాజు.. నేను మంత్రి సినిమా మీద నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన వారికి కౌంటర్లు వేశాడు తేజ. ఈ సినిమాను సమీక్షకులు సరిగా అర్థం చేసుకోలేకపోయారన్నారు. సినిమాలో హీరో క్యారెక్టర్ ఫస్ట్ లో గొప్పగా అనిపించి.. తర్వాత నుంచి డౌన్ అవుతుందని.. అయితే.. అది క్యారెక్టర్ పతనంగా అర్థం చేసుకోవటంలో రివ్యూయర్లు ఫెయిల్ అయ్యారని.. అందుకే ద్వితీయార్థంలో సినిమా డౌన్ అయినట్లు రాశారన్నారు.

ఒకప్పుడు మంచి సమీక్షకులు ఉండేవాళ్లని.. సినిమాను బాగా అర్థం చేసుకునే వారని.. కానీ ఇప్పుడు అలాంటి  రివ్యూయర్లు  తగ్గిపోయారన్నారు. తన సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ గురించి అర్థం చేసుకున్న వారూ ఉన్నారని.. కొందరు మాత్రమే ఆ పాయింట్ ను బాగా పట్టేశారన్నారు. అలా పట్టుకుంటారా? అని అనుకున్నానని కానీ కొందరు పట్టేసుకున్నారని.. అలాంటి వారందరికి హేట్సాప్ అంటూ పొగిడేశారు.

సెకండాఫ్ నెగెటివ్ రెస్పాన్స్ కనిపించిందన్న మాట యూఎస్ లో మొదటి ఆట చూసి చెప్పారని కానీ శాంతి థియేటర్లో తొలిరోజు ప్రేక్షకుల స్పందన చూశాక మాత్రం సినిమా హిట్ అని అర్థం చేసుకున్నట్లుగా చెప్పారు తేజ. ఫస్ట్ షో చూసే వారంతా పారామీటర్లు.. ధర్మామీటర్లు పట్టుకొని వచ్చి పొడుద్దామని చూస్తారని.. కానీ ఒరిజినల్ ప్రేక్షకులు మాత్రం సాయంత్రం షోకు వస్తారని.. వారి తీర్పే ముఖ్యమని చెప్పారు.