కీరవాణి కుటుంబం.. ఎంత ఆత్మాభిమానమో!

Mon Apr 16 2018 17:40:10 GMT+0530 (IST)

కీరవాణి సంగీత దర్శకుడిగానే కాదు.. వ్యక్తిత్వ పరంగానూ చాలా భిన్నంగా కనిపిస్తారు. ఆయన తన కుటుంబ సభ్యులు ఎవరికీ అదే పనిగా అవకాశాలు ఇవ్వడని.. వేరే దగ్గర తన వాళ్లకు అవకాశాల కోసం అడగడని పేరుంది. తన తమ్ముడు కళ్యాణి మాలిక్ దగ్గర ఎంత టాలెంటున్నా సరే ఆయన ఎవరికీ రెకమండ్ చేసింది లేదు. ఈ విషయాన్ని కళ్యాణి మాలికే స్వయంగా చెబుతుంటాడు. తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని కూడా అంటుంటాడు. తన చెల్లెలు శ్రీలేఖ విషయంలో అయినా కీరవాణి అంతే. తమ్ముడు.. చెల్లి మాత్రమే కాదు.. కొడుకుల విషయంలోనూ కీరవాణి ఇంతే అని మరోసారి రుజువైంది. ఆయన కొడుకైన సింహా ‘రంగస్థలం’ సినిమాకు పని చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సింహా ‘రంగస్థలం’కు సౌండ్ ఎఫెక్ట్స్ సమకూర్చాడట. ఐతే అతను కీరవాణి పేరు చెప్పుకుని వెళ్లి ‘రంగస్థలం’లో అవకాశం దక్కించుకోలేదు. తనకు తానుగా వెళ్లాడు. మూడు నెలల పాటు సుకుమార్ దగ్గరికి తిరిగి తిరిగి ఆయన దగ్గర పని చేసే అవకాశం అందుకున్నాడు. ఒక వ్యక్తి తన కారు దగ్గర రోజూ కనిపించేవాడని.. మూడు నెలల పాటు అతను తిరుగుతూనే ఉన్నాడని.. చివరికి తన అసిస్టెంట్లకు చెప్పి అతడిని పిలిపిస్తే.. తాను సౌండ్ ఎఫెక్ట్స్ చేస్తానని అన్నాడని.. డెమో ఇచ్చి మెప్పించి తన దగ్గర పని చేసే అవకాశం దక్కించుకున్నాడని సుక్కు తెలిపాడు. ఐతే అతను కీరవాణి తనయుడన్న సంగతి చాలా ఆలస్యంగా తెలిసిందని.. కీరవాణి ఒక్క ఫోన్ చేసి చెబితే వెంటనే పనిలో పెట్టుకునేవాడినని.. కానీ సొంతంగా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలన్న ఆత్మాభిమానం తనకు చాలా నచ్చిందని.. పిల్లల్ని ఎంత బాగా పెంచారనడానికి ఇది నిదర్శనమని సుక్కు అన్నాడు.