Begin typing your search above and press return to search.

ఛాన్స్ ఇచ్చినోడికే పంచ్ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   24 Feb 2018 10:35 AM GMT
ఛాన్స్ ఇచ్చినోడికే పంచ్ ఇచ్చాడు
X
కొన్నిసార్లు సినీ రంగంలో మిత్రులుగా ఉన్న వాళ్లే బాక్సాఫీస్ దగ్గర ప్రత్యర్థులుగా మారాల్సి వస్తుంది. గత వారాంతంలో అదే జరిగింది. తనకు అవకాశం ఇచ్చిన ఒక వ్యక్తికి మరో వ్యక్తి బాక్సాఫీస్ వేదికగా పంచ్ ఇచ్చాడు. అందులో దెబ్బ తిన్నది హీరో సందీప్ కిషన్ అయితే.. దెబ్బ కొట్టింది కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘అ!’ లాంటి వెరైంటీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్. ఐతే ఈ సినిమా తీయడానికంటే ముందే అతను షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు సంపాదించాడు. అతడేంటో అందరికీ తెలిసేలా చేసిన షార్ట్ ఫిలిం ‘సైలెంట్ మెలోడీ’. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారాను కూడా మెప్పించి.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టిందీ షార్ట్ ఫిలిం.

విశేషం ఏంటంటే.. ‘సైలెంట్ మెలోడీ’ నిర్మాత సందీప్ కిషనే. ప్రశాంత్ అంటే ఎవరికీ పెద్దగా తెలియని సమయంలో ఆ షార్ట్ ఫిలిం ప్రొడ్యూస్ చేశాడు సందీప్. కట్ చేస్తే ప్రశాంత్ దర్శకుడిగా మారి రూపొందించిన తొలి సినిమా ‘అ!’.. సందీప్ చిత్రం ‘మనసుకు నచ్చింది’కి పోటీగా విడుదలైంది. సందీప్ మూవీ పేలవమైన టాక్ తో బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని ఎదుర్కొంటే.. ‘అ!’ మాత్రం మంచి స్పందనే రాబట్టుకుంది. ఈ చిత్రానికి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఇది చర్చనీయాంశం అయితే అయింది. పెట్టుబడిని కూడా వెనక్కి తెచ్చింది. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా ప్రశాంత్ సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన నాని కూడా మంచి ఫలితాన్నే అందుకున్నాడు. మొత్తానికి తనకు తొలి ఛాన్స్ ఇచ్చిన సందీప్ కు బాక్సాఫీస్ దగ్గర పంచ్ ఇచ్చాడన్నమాట ప్రశాంత్.