ఎన్టీఆర్ దర్శకుడికి కొత్త ఆందోళన

Sun Jan 20 2019 11:22:45 GMT+0530 (IST)

ఎన్నో అంచనాలతో ఏవేవో లెక్కలతో భారీ వసూళ్లు ఖాయమన్న గట్టి నమ్మకంతో సంక్రాంతి బరిలో దిగిన ఎన్టీఆర్ కథానాయకుడు తీవ్రంగా నిరాశ పరచడం అభిమానులకు ఏమో కాని క్రిష్ కు మహా సంకటంగా ఉంది. ఎందుకంటే ఏ సినిమాకు పడనంత కష్టం ఒత్తిడి దీనికి అనుభవించాడు. ఇచ్చిన తక్కువ టైం లో డెడ్ లైన్ ని మిస్ అవ్వకుండా కోరుకున్న క్వాలిటీలో తీసివ్వడంలో తన వరకూ ఏ లోపమూ లేదు. 9వ తేది ఉదయం బెనిఫిట్ షో అయ్యాక అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయమూ ఇదే.అయితే బాక్స్ ఆఫీస్ ఫలితం వేరుగా వచ్చింది. అజ్ఞాతవాసి-స్పైడర్ లాంటి డిజాస్టర్స్ సరసన దీనికి చోటు దక్కడం ఊహించని షాక్. నికరంగా 50 కోట్ల నష్టం ఖాయమని తేలడంతో బయ్యర్లు బోరుమంటున్నారు. దీనికి క్రిష్ ఒక్కడే బాధ్యుడు కాదని అందరికీ తెలుసు. అయితే ఇది ఒకరకంగా క్రిష్ మీద ప్రభావం చూపిస్తుండగా మరో టెన్షన్ కూడా తనను వెంటాడుతోంది. ఇంకొక్క 5 రోజుల్లో మణికర్ణిక రానుంది. తనతో మొదలుపెట్టిన సినిమా కంగనా పూర్తి చేయడం పట్ల క్రిష్ అసంతృప్తితో ఉన్నప్పటికీ దాని ఫలితమూ ఎఫెక్ట్ చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎందుకంటే ఒకవేళ మణికర్ణిక సక్సెస్ అయితే క్రిష్ చేయకపోయినా కంగనా బాగా టేకప్ చేసిందన్న ప్రశంశలు వస్తాయి. ఒకవేళ ఫెయిల్ అయితే మధ్యలో వదిలేసి వచ్చాడు కాబట్టి కంగనా సరిగా డీల్ చేయలేక చెడగొట్టింది అన్న అపవాదుని క్రిష్ మోయాల్సి ఉంటుంది. అసలీ గొడవ లేకుండా క్రిష్ పేరు మణికర్ణికలో లేకపోయినా ఏ బాధా లేదు. ఇప్పుడు ఉంది కాబట్టే ఈ చిక్కంతా. అందుకే ఎన్టీఆర్ షాక్ నుంచి కోలుకోకుండానే ఈ మణికర్ణిక ఇంకే ట్విస్ట్ ఇస్తుందో. మహానాయకుడు  వర్క్స్ లో బిజీగా ఉంటూనే క్రిష్ దీని గురించి ఆలోచిస్తున్నాడన్నది స్పష్టం. బయట కనిపించినప్పుడు క్రిష్ మొహంలో అది తెలుస్తోంది కూడా.