Begin typing your search above and press return to search.

కథ చెప్పా.. డైరెక్షన్ చేసేయమన్నాడు

By:  Tupaki Desk   |   16 July 2017 4:29 AM GMT
కథ చెప్పా.. డైరెక్షన్ చేసేయమన్నాడు
X
సుకుమార్ ను టాలీవుడ్లో ఒక జీనియస్ డైరెక్టర్ గా పరిగణిస్తారు అందరూ. అలాంటి దర్శకుడు.. అతను నా హార్డ్ డిస్క్.. అతను గూగుల్ అంటూ ఇప్పుడే మెగా ఫోన్ పట్టిన ఓ దర్శకుడి గురించి చెప్పడమంటే మామూలు విషయం కాదు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. హరి ప్రసాద్ జక్కా. సుకుమార్ తో కలిసి లెక్చరర్ గా పని చేసి.. అతడి సాయంతో ఇండస్ట్రీలోకి వచ్చి.. తనకు రచనా సహకారం అందించి.. ఇప్పుడు ‘దర్శకుడు’ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు హరిప్రసాద్. తన తొలి సినిమా ఆడియో వేడుకలో హరిప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అసలు డైరెక్టర్ అవ్వాలనే అనుకోలేదని.. కానీ సుకుమారే తనను అనుకోకుండా దర్శకుణ్ని చేసేశాడని చెప్పాడు.

‘‘నేనసలు డైరెక్షన్ చేయాలనే అనుకోలేదు. ఒకసారి మామూలుగా సుకుమార్ కు ‘దర్శకుడు’ కథ చెప్పా. వెంటనే నువ్వే డైరెక్షన్ చేయొచ్చుగా అన్నాడు. సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఐతే ‘దర్శకుడు’ ట్రైలర్లో హీరోయిన్ కు డౌట్ వచ్చినట్లే.. అసలు డైరెక్టర్ అంటే ఏం చేస్తాడు అనే సందేహం నాకుండేది. అది నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నపుడు తెలిసింది. నేను టాలీవుడ్లో చాలామంది దర్శకుల తొలి సినిమాలు చూశాను. అవి బాగా ఆడాయి. అందుకు కారణం వాళ్ల తొలి సినిమాలకు మంచి టెక్నీషియన్లను ఎంచుకోవడమే. నా సినిమాకు కూడా అదే పాటించాను. సాయి కార్తీక్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. ప్రవీణ్ లాంటి మంచి సినిమాటోగ్రాఫర్.. ఇలా అందరూ చక్కటి టెక్నీషియన్లు కుదిరారు. అశోక్ కళ్లల్లో ఉన్న ఇంటెన్సిటీ చూసి అతణ్ని హీరోగా తీసుకున్నా. ఒక తెలుగమ్మాయి.. డస్కీగా ఉండాలి.. అలిగితే బాగుండాలి.. ఈ లక్షణాలన్నీ ఉన్న ఈషాను హీరోయిన్ గా తీసుకున్నా. చూడగానే చాలా అందంగా ఉందే అనిపించేలా ఉండాలని పూజితను మరో కథానాయికగా ఎంచుకున్నా’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు హరిప్రసాద్.