నాన్న కోసం చిరునే ఇంటికి వచ్చారు

Sun Nov 19 2017 15:26:56 GMT+0530 (IST)

రీల్ కంటే ఎమోషనల్ సీన్లు రియల్ లైఫ్ లో చాలానే ఉంటాయి. అలాంటి ఉదంతమే ఇప్పుడు చెప్పేది. జైలవకుశ సినిమాతో తన సత్తాను మరోసారి చాటిన దర్శకుడు బాబీ. తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారు.చిన్నతనంలో తనకు సినిమాల్ని తన తండ్రి పరిచయం చేయటమే కాదు.. స్కూల్ కు వెళుతున్నట్లుగా ఇంట్లో చెప్పించి.. చిరు సినిమాలకు తీసుకెళ్లేవారని చెప్పారు.  తన తండ్రి చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని.. తన తండ్రితో కలిసి చిరు సినిమాలకు ఎక్కువగా వెళుతుండేవాడినని చెప్పారు.

చిరంజీవి సినిమా విడుదలైతే చాలు.. వీధి చివరన తన తండ్రి తన కోసం వెయిట్ చేసేవారని.. తాను స్కూల్ కు వెళుతున్నట్లు చెప్పి బ్యాగ్ ను భుజాన వేసుకొని ఇంట్లోకి నుంచి బయటకు వచ్చి.. తండ్రితో కలిసి చిరు సినిమాను చూసేవాడినని గుర్తు చేసుకున్నారు.

కొద్దికాలం క్రితం తన తండ్రి అనారోగ్యానికి గురయ్యారని.. ఆ సందర్భంగా తన తండ్రి తనతో మాట్లాడుతూ.. నేను నీకు చిరంజీవి సినిమాలు చూపించా. మరి.. నాకు చిరంజీవిని చూపించవా? అని అడగటం తనకు చాలా బాధకు గురి చేసిందన్నారు. వెంటనే వి.వి. వినాయక్ కు ఫోన్ చేసి విషయం చెప్పానని.. ఆయన ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పారన్నారు.

తన తండ్రి గురించి తెలిసిన వెంటనే చిరు స్వయంగా ఫోన్ చేశారని.. తన ఇంటికి వచ్చారన్నారు. ఒక పూట అంతా చిరు తమ ఇంట్లో గడిపారని..ఆ రోజును మర్చిపోలేనన్నారు.  రీల్ సీన్‌కు ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ రియల్ సీన్  ఉంది కదూ.