తమిళ అర్జున్ రెడ్డి గొడవ.. బాలా లైన్లోకొచ్చాడు

Sun Feb 10 2019 09:22:25 GMT+0530 (IST)

తెలుగులో కల్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న ‘అర్జున్ రెడ్డి’ని తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా సీనియర్ దర్శకుడు బాలా దర్శకత్వంలో రీమేక్ చేయగా.. సినిమా విడుదలకు సిద్ధం అయ్యాక దాన్ని పక్కన పెట్టి వేరే దర్శకుడితో కొత్తగా మళ్లీ సినిమా తీయబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. తమిళ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న బాలా తీసిన సిినిమాను ఇలా స్క్రాప్ చేయడం వేరే దర్శకుడితో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించడం ఆయనకు పెద్ద అవమానమే. ఈ పరిణామం తమిళ సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై బాలా వెర్షన్ ఏంటో తెలుసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు.బాలా శనివారం సాయంత్రం పెదవి విప్పారు. ఈ వివాదంపై ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.‘వర్మ’ నిర్మాతల వెర్షన్ ప్రకారం వాళ్లే బాలాను తప్పించారు. కానీ బాలా మాత్రం తానే ఈ సినిమా నుంచి బయటికి వచ్చేశానని స్పష్టం చేశాడు. తన సంస్థ అయిన ‘బి ఫిలిమ్స్’కు ‘వర్మ’ ప్రొడక్షన్ హౌజ్ ‘ఈ4 ఎంటర్టైన్మెంట్స్’కు మధ్య ఈ మేరకు జరిగిన ఒప్పంద పత్రాన్ని కూడా ఆయన బయటపెట్టారు. ఈ సినిమాతో బాలా భాగస్వామ్యం తెంచుకున్నట్లుగా జనవరి 22నే అగ్రిమెంట్ జరిగింది. ఇదే విషయాన్ని బాలా ప్రెస్ నోట్లో ప్రస్తావించాడు. తన క్రియేటివ్ ఫ్రీడమ్ ను కాపాడుకోవడానికే ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చానన్నాడు. ఈ చిత్ర నిర్మాతలు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పని తేల్చాడు. ధ్రువ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను ఇంకేమీ మాట్లాడట్లేదని.. ఇంతటితో వ్యవహారానికి ముగింపు పలుకుతున్నానని బాలా పేర్కొన్నాడు.