హీరో జైల్లో ఉంటే.. సినిమా రిలీజుకు రెడీ

Thu Sep 14 2017 14:09:03 GMT+0530 (IST)

మలయాళ స్టార్ హీరోయిన్ కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో రెండు నెలల కిందట అరెస్టయిన స్టార్ హీరో దిలీప్ ఇంకా బయటికి రాని సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. రెండుసార్లూ అది తిరస్కరణకు గురైంది. ఇప్పుడు మరోసారి బెయిల్ కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు దిలీప్. ఈ కేసు సంగతిలా ఉంటే.. మరోవైపు దిలీప్ నటించిన ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. ఆ సినిమా పేరు.. రామ్ లీలా. దిలీప్ ఈ సినిమాను కొన్ని నెలల కిందటే పూర్తి చేశాడు. ఐతే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో అతను కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లాడు.

దిలీప్ మీద జనాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు ‘రామ్ లీలా’ సినిమాను రిలీజ్ చేయడానికి వెనుకంజ వేశారు. ఇప్పుడు జనాలు కొంచెం శాంతించిన నేపథ్యంలో సినిమాను బయటికి తీసుకొచ్చారు. సెప్టెంబరు 28న దసరా కానుకగా ‘రామ్ లీలా’ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ లోపు దిలీప్ కు బెయిల్ లభిస్తే సినిమాకు అది కొంచెం మేలు చేస్తుంది. దిలీప్ ప్రమోషన్లలో కూడా పాల్గొనే అవకాశముంది. ఐతే హీరోయిన్ కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో దిలీప్ కు నిజంగా పాత్ర ఉందని మెజారిటీ జనాలు నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి సినిమాను ఎలా ఆదరిస్తారన్నది సందేహంగానే ఉంది. థియేటర్ల దగ్గర నిరసన ప్రదర్శనలు జరగొచ్చని.. సినిమా ప్రదర్శనకు కొన్ని చోట్ల బ్రేక్ పడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.