Begin typing your search above and press return to search.

‘దిల్’ మ్యాజిక్ పని చేస్తే రుద్రమదేవి పనైపోద్ది

By:  Tupaki Desk   |   31 July 2015 10:00 AM GMT
‘దిల్’ మ్యాజిక్ పని చేస్తే రుద్రమదేవి పనైపోద్ది
X
ఒకప్పుడు దిల్ రాజు పట్టిందల్లా బంగారమే అన్నట్లుండేది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా తిరుగులేని విజయాలందుకున్నాడు. కానీ మధ్యలో దెబ్బతిన్నాడు. ఇప్పుడు మళ్లీ కోలుకుని దూసుకెళ్లిపోతున్నాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి దిల్ రాజు పట్టిందల్లా బంగారమే అవుతోంది. పటాస్ సినిమా రాజుకు ఎంత బాగా కలిసొచ్చిందో తెలిసిందే. మణిరత్నం ట్రాక్ రికార్డు బాలేకపోవడంతో ఓకే బంగారం సినిమాను చాలా తక్కువ కొని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్ చేసి లాభాలు రాబట్టిన రాజు.. ఆ తర్వాత ‘గంగ’ మీద పెట్టుబడి పెట్టి భారీగా సొమ్ము చేసుకున్నాడు. ఆపై నిర్మాతగా చేసిన ‘కేరింత’ కూడా లాభాలు తెచ్చిపెట్టింది. ఇక తాజాగా ‘బాహుబలి’ రాజును కనక వర్షంలో ముంచెత్తింది. నైజాం ఏరియాకు రూ.22.5 కోట్ల రికార్డు ధర పెట్టి సినిమాను కొంటే.. ఆ సినిమా రూ.40 కోట్ల మార్కునందుకుంటోంది. షేర్ మాత్రమే చూసినా రాజుకు ఓ పది కోట్ల దాకా మిగిలేలా కనిపిస్తోంది.

రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తర్వాతి సినిమా ‘రుద్రమదేవి’. బిజినెస్ సరిగా కాకపోవడం వల్లే ఆ సినిమా ఇంత ఆలస్యమైంది. ఐతే గుణశేఖర్.. దిల్ రాజుకు సినిమా చూపించడం, అతను నైజాం రైట్స్ తీసుకోవడంతో బిజినెస్ ముందుకు కదిలింది. రాజు ఓకే చేశాడంటే ధైర్యంగా పెట్టుబడి పెట్టవచ్చిని మిగతా ఏరియాల బయ్యర్లు కూడా ముందుకొచ్చారు. గుణశేఖర్ ఒకప్పుడు అనుకున్న స్థాయిలో కాకున్నా బాగానే బిజినెస్ జరిగింది. దిల్ రాజు ప్రస్తుత ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే ‘రుద్రమదేవి’ కూడా పెద్ద హిట్టవుతుందన్న అంచనాలతో ఉన్నారు జనాలు. రిలీజ్ కు ఇంకా నెలన్నర సమయం ఉండటంతో సినిమాను బాగా ప్రమోట్ చేయడానికి గుణశేఖర్ తో కలిసి ప్రణాళికలు రచిస్తున్నాడట రాజు. మొత్తానికి దిల్ రాజు మ్యాజిక్ పని చేస్తే రుద్రమదేవి సేఫ్ గా బాక్సాఫీస్ గండాన్ని దాటేసే ఛాన్స్ ఉంటుంది.