Begin typing your search above and press return to search.

'ఆ నలుగురు'.. దిల్‌ రాజు వాదన సబబే

By:  Tupaki Desk   |   11 Feb 2019 2:51 PM GMT
ఆ నలుగురు.. దిల్‌ రాజు వాదన సబబే
X
టాలీవుడ్‌ లో చిన్న నిర్మాతలను బతకనివ్వడం లేదని, వారు తీసే సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఆ నలుగురు నిర్మాతలు ఇబ్బంది పెడుతున్నారు అంటూ చాలా కాలంగా కొందరు ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. రాష్ట్రంలోని మెజార్టీ థియేటర్లు దిల్‌ రాజు - అల్లు అరవింద్‌ - ఏషియన్‌ సునీల్‌ - సురేష్‌ బాబుల ఆధీనంలో ఉన్నాయని, వారు పెద్ద సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇస్తూ చిన్న సినిమాలకు అస్సలు థియేటర్లను కేటాయించరు అంటూ వస్తున్న ఆరోపణలపై తాజాగా దిల్‌ రాజు తీవ్రంగా స్పందించాడు. ఈ విషయంలో మీడియా వారిపై కూడా దిల్‌ రాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్‌ రాజు ఈ విషయమై మాట్లాడుతూ... చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందన్న మాటపై వాస్తవం లేదు. కంటెంట్‌ ఉన్న సినిమా అయితే చాలు అది చిన్నదా పెద్దదా అనే విషయం చూడకుండా ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆధరిస్తారు. చిన్న సినిమాలకు థియేటర్లు తక్కువ ఇచ్చినా సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే రెండవ రోజు నుండే థియేటర్ల సంఖ్య పెంచడం జరుగుతుంది. సినిమాలో కంటెంట్‌ మాత్రం ఉండదు కాని, థియేటర్లు మాత్రం వందల సంఖ్యలో కావాలి అంటే ఎలా కుదురుతుంది. థియేటర్లు ఎక్కువ కావాలని, స్క్రీన్స్‌ ఎక్కువ కావాలని మల్టీ ప్లెక్స్‌ వారిని అడగగలరా. మల్లీప్లెక్స్‌ యాజమాన్యాలు మొదటి వారం 52 శాతం - రెండవ వారం 45 శాతం - మూడవ వారం 35 శాతం మాత్రమే నిర్మాతలకు ఇస్తున్నారు. కాని మా వద్ద ఉన్న థియేటర్లలో అలా చేయడం లేదు. మల్టీప్లెక్స్‌ థియేటర్లు అన్ని కూడా ముంబయి నుండి ఆపరేట్‌ చేయబోతున్నాయి కనుక వాటికి భారీగా అందరు సమర్పించుకుంటున్నారు. కాని లోకల్‌ థియేటర్ల విషయంలో మాత్రం అలా చేస్తామంటూ ఊరుకుంటారా. మేము కూడా మా థియేటర్లను ముంబయి వెళ్లి ఆపరేట్‌ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది.

సినిమా బాగుంటే తప్పకుండా థియేటర్లు ఇస్తాం, ఎక్కువ థియేటర్లు ఇచ్చినంత మాత్రాన ప్రేక్షకులు సినిమాను చూడరు కదా, ముందు సినిమా బాగా చేయండి, సినిమాలో కంటెంట్‌ బాగా ఉంటే తప్పకుండా థియేటర్లు లభిస్తాయి. చిన్న సినిమాలకు సమస్య వస్తే తప్పకుండా నావంతు సాయం నేను చేస్తాను. ఆమద్య హుషారు సినిమా ఇబ్బందుల్లో ఉంటే నేను సాల్వ్‌ చేశాను. సినిమా బాగుంటే థియేటర్లను రెండవ రోజు నుండే పెంచుతామని తాను గతంలో కూడా చెప్పాను.

తెలంగాణలో మొత్తం 400 థియేటర్లు ఉంటే నా వద్ద ఉన్న థియేటర్లు 40 మాత్రమే. ఏషియన్‌ సునీల్‌ - సురేష్‌ బాబు గారి వద్ద 120 థియేటర్లు ఉంటాయి. మిగిలిన థియేటర్లు అన్ని కలిపి మరో 50 ఉంటాయి. థియేటర్లను మెయింటెన్స్‌ చేయలేక యాజమాన్యాలు లీజ్‌ కు ఇస్తున్నారు. సంవత్సరంలో ఫిబ్రవరి - మార్చి - జూన్‌ - జులైలలో సినిమాలు ఎక్కువగా ఉండవు. థియేటర్లు అప్పుడు లాస్‌ లో నడుస్తాయి. సంక్రాంతి - సమ్మర్‌ - దసరా సీజన్‌ లలో మాత్రమే థియేటర్లు ఎక్కువగా నడుస్తాయి. మిగిలిన సమయంలో వచ్చే లాస్‌లను బ్యాలన్స్‌ చేస్తూ థియేటర్లను రన్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కలెక్షన్స్‌ వచ్చే సినిమాలకే థియేటర్లు ఇవ్వాలని అనుకుంటాం. చిన్న సినిమాలైనా కలెక్షన్స్‌ వస్తాయంటే తప్పకుండా ఇస్తామని దిల్‌ రాజు అన్నాడు.

దిల్‌ రాజు వాదన సబబే అనిపిస్తుంది. చిన్న సినిమాకు కూడా వందల సంఖ్యలో థియేటర్లను ఇవ్వడం సాద్యం అయ్యే పని కాదు. అయితే సక్సెస్‌ అయినప్పుడు సినిమాకు థియేటర్లు ఇవ్వకుంటే మాత్రం తప్పే. కాని ఈమద్య కాలంలో మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలకు మంచి థియేటర్లు దక్కాయి, మంచి వసూళ్లు వచ్చాయి. అందుకే దిల్‌ రాజు చెప్పిందాంట్లో నిజం ఉందనిపిస్తుంది.