డబ్బుకు ఆశ పడని నానికి హ్యాట్సాఫ్

Tue Apr 23 2019 11:15:25 GMT+0530 (IST)

నాని హీరోగా నటించిన 'జర్సీ' చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు - భారీగా వసూళ్లను రాబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులను అభినందించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. మంచి సినిమాలు వచ్చిన సమయంలో వాటిని అభినందించడం దిల్ రాజుకు ఉన్న మంచి అలవాటు. తాజాగా జర్సీ చిత్రం వంటి ఒక గొప్ప సినిమాను తీసినందుకు - చేసినందుకు - నిర్మించినందుకు దర్శకుడు - హీరో - నిర్మాతపై దిల్ రాజు ప్రశంసలు కురిపించాడు.ఈ సందర్బంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తాయి - అందులో కొన్ని సక్సెస్ అవుతాయి అయితే సక్సెస్ అయిన సినిమాల్లో కూడా కొన్ని మాత్రమే గుండెకు హత్తుకునేలా ఉంటాయి. అలాంటి సినిమా జెర్సీ. ఈ సినిమా విడుదలకు రెండు వారాల ముందు నేను చూశాను. అప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో విడుదలైన తర్వాత ప్రేక్షకులు కూడా అలా ఫీల్ అవుతున్నారు. కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన అనుభవం ఉన్న దర్శకుడు ఇలాంటి సినిమాను తీయడం గ్రేట్. భార్య భర్తల మద్య డైలాగ్స్ లేకుండా వారి ఎమోషన్ ను చూపించడం అద్బుతంగా అనిపించింది. తాను అనుకున్న కంటెంట్ ను అద్బుతంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు గౌతమ్ పూర్తి సక్సెస్ అయ్యాడు. ఇంత పెద్ద విజయంకు ఫస్ట్ క్రెడిట్ దర్శకుడికే దక్కుతుంది అన్నాడు.

ఇక ఈ చిత్రంలో నటించిన నానిని ఎంత అభినందించినా తక్కువే. సహజ నటుడిగా పేరు దక్కించుకున్న నాని ఒక గొప్ప నటుడు అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. నాని నటించిన సినిమా ఆడినా ఆడకున్నా అందులో అతడి సహజ నటన మాత్రం కనిపిస్తుంది. నాని డిమాండ్ చేస్తే ఎంత పారితోషికం అయినా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. అలాంటిది నాని ఈ చిత్రంను పారితోషికం తీసుకోకుండా చేసేందుకు ముందుకు రావడం ఆశ్చర్యంగా అనిపించింది. అతడి డెడికేషన్ కు నాకు కన్నీళ్లు వచ్చాయి. సినిమాపై అతడికి ఉన్న నమ్మకం అలాంటిది. హీరో డబ్బుకు ఆశ పడకుండా మంచి కథలను ఎంచుకుని ఇలాంటి సినిమాలు చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. హీరోలు పారితోషికంకు ఆశ పడకుంటేనే ఇలాంటి అద్బుతమైన సినిమాలు వస్తాయి. నిజంగా నానికి ఈ విషయంలో హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఇలాంటి ఒక కథను నమ్మి - సినిమా చేసినందుకు నానికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేక పోతున్నాను. చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా దిల్ రాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాడు.