Begin typing your search above and press return to search.

దిల్ రాజు.. చిన్న సినిమాల బాధలు

By:  Tupaki Desk   |   19 July 2018 7:43 AM GMT
దిల్ రాజు.. చిన్న సినిమాల బాధలు
X
ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం కంటే దాన్ని సజావుగా రిలీజ్ చేయడం.. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం.. మంచి వసూళ్లు రాబట్టడం అన్నది సవాలుగా మారింది. అందులోనూ చిన్న సినిమాల పరిస్థితి మరీ కష్టంగా ఉంది. ప్రేక్షకుల్లో ఏదో ఒక క్యూరియాసిటీ తీసుకొస్తే తప్ప చిన్న సినిమాలు చూడ్డానికి థియేటర్లకు రావడం లేదు. ఈ విషయంలో దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత సైతం ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఆయనే చిన్న సినిమాలతో చాలా కష్టం అనేస్తున్నారు. అవి వర్కవుట్ కావని.. అందుకే పెద్ద హీరోలతో ఒక రేంజ్ సినిమాలే చేయడానికి ప్రయత్నిస్తున్నానని రాజు చెబుతుండటం విశేషం. ఇందుకు ఆయన ‘కేరింత’ సినిమా అనుభవాన్ని ఉదాహరణగా చెప్పారు. ఈ విషయంలో ఆయన వెర్షన్ ఏంటంటే..

‘‘చిన్న సినిమా చేయాలంటే భయమేస్తుంది. ప్రేక్షకుడిని థియేటర్‌ వరకు తీసుకురావాల్సి ఉంటుంది. ఇదివరకు ‘కేరింత’ సినిమాని తీశాం. మొదట తీసింది నచ్చలేదు. దాంతో అది పక్కనపెట్టి మళ్లీ తీశాం. విడుదలైన తర్వాత సినిమా బాగుందనే టాక్‌ వచ్చినా వసూళ్లు రాలేదు. దాంతో ప్రేక్షకుల్ని థియేటర్‌ కి రప్పించడం కోసం పలు ప్రాంతాల్లో తిరిగాం. అలా చిన్న సినిమాలకి పెట్టిన డబ్బు రాబట్టుకోవడం చాలా కష్టమవుతోంది. అదే సమయాన్ని ఓ మోస్తరు పేరున్న కథానాయకుడి సినిమాకి వినియోగిస్తే ప్రేక్షకుడు థియేటర్‌ కి వస్తాడు కదా. అందుకే పేరున్న కథానాయకులతో ఎక్కువగా సినిమాలు చేస్తున్నాం’’ అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు రాజు. రాజు నుంచి ఇప్పుడు ‘లవర్’ అనే చిన్న సినిమా వస్తోంది. ఈ సినిమా ఆడకపోతే మున్ముందు ఆయన లో బడ్జెట్ సినిమాల జోలికే వెళ్లరేమో.