Begin typing your search above and press return to search.

దిల్‌ రాజు జ‌డ్జిమెంట్‌ కి ఏమైంది?

By:  Tupaki Desk   |   15 Aug 2018 4:30 PM GMT
దిల్‌ రాజు జ‌డ్జిమెంట్‌ కి ఏమైంది?
X
హీరో హీరోయిన్ల‌కే కాదు.. నిర్మాత‌ల‌కీ ఓ మార్కెట్టుంటుంది. పోస్ట‌ర్‌పై బ్యాన‌ర్ పేరునీ... నిర్మాత పేరునీ చూసి సినిమాకి వెళ్లే ప్రేక్ష‌కులు ఎంతోమంది. అలా తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న పేరుకీ - త‌న సంస్థ‌కీ ఒక బ్రాండ్ విలువ‌ని సృష్టించుకొన్న నిర్మాత దిల్‌ రాజు. ఆయ‌న సినిమా తీస్తున్నాడంటే కుటుంబ ప్రేక్ష‌కులంతా క‌లిసి థియేట‌ర్‌ కి వెళ్లొచ్చ‌ని.. వినోదానికి లోటుండ‌ద‌నే ఓ గ‌ట్టి న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో క‌నిపిస్తుంటుంది. ఆయ‌న ప‌ట్టింద‌ల్లా బంగారమే అనే అభిప్రాయం ప‌రిశ్ర‌మ‌లోనూ వినిపిస్తుంటుంది. అయితే ఈమ‌ధ్య ఆయ‌న సంస్థ నుంచి వ‌స్తున్న సినిమాల్ని చూస్తే దిల్‌ రాజు త‌న జ‌డ్జిమెంట్‌ ని కోల్పోయాడా అనే ప్ర‌శ్న ఉద‌యించ‌క త‌ప్ప‌దు. `ఫిదా` త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న్నుంచి ఆ స్థాయి సినిమా రాలేదు. కొత్త‌ద‌నంతో కూడిన క‌థ‌ల‌కి పెట్టింది పేరైన దిల్‌ రాజు నుంచి ఆర్య‌ - బొమ్మ‌రిల్లు - సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలొచ్చాయి. ఆ త‌ర‌హా సినిమాలు ఇటీవ‌ల కాలంలో ఆయ‌న్నుంచి రాక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచే విష‌య‌మే.

దిల్‌ రాజు ద‌ర్శ‌కుల ప‌నిలో జోక్యం చేసుకోవ‌డంతోనే ఇదంతా అనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి ఈమ‌ధ్య‌. వాటిని దిల్‌ రాజు బ‌హిరంగంగానే తోసిపుచ్చారు. ద‌ర్శ‌కుల‌కి కావ‌ల్సినంత స్వేచ్ఛ‌నిచ్చే నిర్మాత‌న‌ని చెప్పుకొచ్చాడు. ఆయ‌న‌న్న‌దే నిజ‌మే అయితే ఫ‌లితాలెందుకు ఇలా అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. దిల్‌ రాజు ద‌ర్శ‌కుల ప‌నిలో జోక్యం చేసుకోక‌పోయినప్ప‌టికీ... ద‌ర్శ‌కులు త‌యారు చేసిన క‌థ‌ల్లో మితిమీరిన మార్పులు చేయిస్తుంటార‌ని - యేళ్ల‌పాటు త‌న ఆఫీసులో కూర్చోబెట్టి వాటికి కొత్త రూపు ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తుంటార‌ని... అదే ఆయ‌నకి ఇబ్బందిగా ప‌రిణ‌మించింద‌నే మాట ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ల‌వ‌ర్‌ - శ్రీనివాస‌క‌ళ్యాణం సినిమాల ఫ‌లితాల‌వ‌ల్లే ఆయ‌న గురించి సినిమా ఇండ‌స్ట్రీలో ఇంత‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి దిల్‌ రాజు త‌న జ‌డ్జిమెంట్‌ కి ఏమీ కాలేద‌ని నిరూపించుకోవాలంటే `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే` - `ఎఫ్‌2` చిత్రాల విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందేనేమో.