రాజుగారి లెక్కలు తప్పాయే!

Mon Apr 16 2018 17:53:00 GMT+0530 (IST)

దిల్ రాజు ఓ సినిమాను విడుదల చేస్తున్నాడంటే... అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుందనే నమ్ముతారు సినీ జనాలు. దిల్ రాజు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత... అలాగే మంచి స్ట్రాటెజీ కలిగిన డిస్ట్రిబ్యూటర్ కూడా. అయితే నిర్మాతగా వరుస విజయాలు కొడుతున్న రాజుగారు... డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం గత ఏడాది నుంచి ఊహించని విధంగా పెద్ద పెద్ద షాకులు తింటున్నారు.గత ఏడాది  మహేష్ బాబు- మురగదాస్ కాంబినేషన్ మీద నమ్మకంతో ‘స్పైడర్’ హక్కులు కొన్నాడు దిల్ రాజు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా దేశంలో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలవడంతో దిల్ రాజుకి పెద్ద షాకే కొట్టింది. ఆ తర్వాత  పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే రికార్డులు తిరగరాయడం పక్కా అని గుడ్డిగా డిసైడైపోయి ‘అజ్ఞాతవాసి’ హక్కులను రికార్డు ధరకి కొన్నాడు రాజు. కానీ ‘అజ్ఞాతవాసి’ విడుదలయ్యాక అజ్ఞాతంలోకి పోవడంతో మరో పెద్ద షాక్ తగిలిందాయనకి. ఈ రెండు సినిమాల వల్ల రాజుగారికి ఏకంగా 60 కోట్ల నష్టం వచ్చింది. ఈ రెండు సినిమాల ప్రభావంతో పెద్ద సినిమాలు కొనేందుకు వెనకడుగు వేశాడు దిల్ రాజు. ‘రంగస్థలం’ సినిమాను కొనేందుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఈ సినిమా ఇప్పుడు నాన్- బాహుబలి ఇండస్ట్రీ హిట్టు కొట్టి... డిస్ట్రిబూటర్లకు వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

అదీ గాక వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని మీదున్న నమ్మకంతో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాని కొని... రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాడు దిల్ రాజు. కానీ ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పుడున్న కలెక్షన్ల దృష్ట్యా చూస్తే రాజుగారి డబ్బు వెనక్కి రావడం డౌటే! నెక్ట్స్ రాజుగారు ఫ్లాపులతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మెహబూబా’ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. పూరీ అయినా రాజుకి లాభాలు చూపిస్తాడో లేదో చూడాలి...