Begin typing your search above and press return to search.

బంతుల థియరీ వదలని రాజు గారు

By:  Tupaki Desk   |   17 Dec 2017 10:57 AM GMT
బంతుల థియరీ వదలని రాజు గారు
X
ఈ ఏడాది ‘ఫిదా’ సినిమా ఆడియో వేడుకలో మొదలైంది దిల్ రాజు ‘ఆరు బంతులు.. ఆరు సిక్సర్లు’ థియరీ. ఓవర్లో ఆరు బంతుల్లాగా.. ఈ ఏడాది తమ సంస్థ నుంచి ఆరు సినిమాలు వస్తున్నాయని.. ఆ ఆరింట్లో మూడు సిక్సర్లయ్యాయని.. ఇంకో మూడు కూడా బౌండరీ దాటుతాయని తొలిసారిగా ఆ ఆడియో వేడుకలో ప్రస్తావించాడు రాజు. ఆ తర్వాత ‘రాజా ది గ్రేట్’ సినిమాకు కూడా ఇదే బంతుల థియరీ వినిపించాడు. ఇప్పుడు ‘ఎంసీఏ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సైతం రాజు ఈ ‘బంతుల’ మాట వదల్లేదు. తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తమ సంస్థ నుంచి ఒకే ఏడాది ఆరు సినిమాలు రిలీజవుతున్నాయని.. అందులో ఐదు సూపర్ హిట్టయ్యాయని.. ఆరోదైన ‘ఎంసీఏ’ కూడా సూపర్ డూపర్ హిట్టవుతుందని.. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు పక్కా అని ధీమా వ్యక్తం చేశాడు రాజు.

నాని తమ సంస్థలో ‘నేను లోకల్’ చేస్తున్నపుడే ‘ఎంసీఏ’కు ఓకే చెప్పాడని.. సాయిపల్లవి కూడా ‘ఫిదా’ విడుదలకు ముందే ఈ సినిమాకు అంగీకరించిందని.. వాళ్లు చేసిన ఆ రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్లు అయినట్లే ‘ఎంసీఏ’ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని రాజు ధీమా వ్యక్తం చేశాడు. నాని రెండు మూడేళ్లుగా వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడని.. అతనంత మంచి కథలు ఎంచుకుంటున్నాడు కాబట్టే అలా సక్సెస్ లు సాధిస్తున్నాడని రాజు అన్నాడు. ‘ఎంసీఏ’ కథ దర్శకుడు వేణు శ్రీరామ్ నిజ జీవిత కథే అని.. అతనో మిడిల్ క్లాస్ కుర్రాడని అన్నాడు రాజు. ఈ సినిమా చూశాక నాని.. సాయి పల్లవి.. భూమిక.. విలన్ పాత్ర చేసిన విజయ్ వర్మ గురించి అందరూ మాట్లాడుకుంటారని.. సినిమా ప్రథమార్ధమంతా వినోదాత్మకంగా సాగి.. ద్వితీయార్ధంలో కథ మీద నడుస్తుందని.. సినిమా అయ్యాక చాలా మంచి ఫీలింగ్ తో జనాలు థియేటర్ నుంచి బయటికి వస్తారని రాజు అన్నాడు.