ఆంధ్రా నైజాం ప్రేక్షకులకు తేడా ఇదే : దిల్ రాజు

Tue Feb 12 2019 20:00:01 GMT+0530 (IST)

టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒక్కడిగా నిలిచిన దిల్ రాజు పై ఆయన సినిమా సక్సెస్ అయినప్పుడు ఏ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయో అదే స్థాయిలో ఆయన చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒక నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా థియేటర్ ఓనర్ గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ ఆయనకు తెలుసు వాటికి పరిష్కారం ఏంటో కూడా ఆయనకు తెలుసు. ఏ సినిమా ఎలా ఎక్కడ విడుదల చేస్తే బాగుంటుంది ఆంధ్రా ప్రేక్షకుల అభిరుచి ఏంటీ నైజాం ప్రేక్షకుల సినిమా టేస్టు ఏంటీ అనే విషయాలను దిల్ రాజు చక్కగా అర్థం చేసుకున్నాడు. ఏపీ మరియు నైజాం ఏరియాల్లో బెనిఫిట్ షోల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఏపీలోని ప్రతి థియేటర్ లో కూడా బెనిఫిట్ షో వేస్తే మంచి వసూళ్లు వస్తాయి. కాని నైజాం ఏరియాల్లో మాత్రం బెనిఫిట్ షోలు అంతగా వర్కౌట్ అవ్వవు. స్టార్ హీరోల సినిమాల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లు ఖమ్మం లోని ఒకటి రెండు థియేటర్లలో తప్ప నైజాం ఏరియా మొత్తంలో బెనిఫిట్ షోలు నడిచే పరిస్థితి ఉండదు. తెలంగాణ ప్రేక్షకులు ఉదయం ఆరు గంటల షోకు వెళ్లేందుకు ఆసక్తి చూపించరు అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు. నైజాం ఏరియాలో బెనిఫిట్ షోలను వేయాలనుకోవడం వృదా ప్రయాస అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.

తనను ఒకానొక సమయంలో నిర్మాతల మండలికి అద్యక్షుడిగా ఉండమన్నారు. ఏకగ్రీవంగా అయితే పర్వాలేదు కాని పోటీ ఉంటే మాత్రం నేను ఉండను అన్నాను. అసలు నిర్మాతల మండలిలో ఎన్నికలు ఉంటే గ్రూపులుగా వర్గాలుగా నిర్మాతలు విడిపోతారు. అది ఇండస్ట్రీకే ప్రమాదం. అందుకే నేను 12 మంది రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ను ఎంపిక చేసి వారితో కమిటీ వేసి వారిలోంచి అధ్యక్షుడిని ఎంపిక చేయాలని సలహా ఇచ్చాను. కాని అది అమలు కాలేదు. ఒకప్పుడు దాసరి గారు ఉంటే ఏ సమస్య వచ్చినా కూడా ఆయన పిలిపించి మరీ మాట్లాడే వారు. ఆయనకు పోయిన తర్వాత సమస్యల గురించి నోరు ఎత్తి మాట్లాడే వారు కరువయ్యారు అంటూ దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.