డిజిటల్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్

Fri Aug 17 2018 19:33:23 GMT+0530 (IST)

డిజిటల్ రాకతో టాలీవుడ్ లో కొత్త మంటలు మొదలయ్యాయా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. సినిమా రిలీజైన 28 రోజులకే ఆన్ లైన్ లో  రిలీజ్ చేసుకునేలా డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలతో ఒప్పందాలు సాగుతున్నాయి.  అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ - హాట్ స్టార్ - ఈరోస్ వంటి సంస్థలు రిలీజ్ ముందే డిజిటల్ హక్కులు కొనుక్కుని రిలీజ్ చేసేయడం డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. భారీ బడ్జెట్ సినిమాలతో కొంతవరకూ ఓకే కానీ మీడియం రేంజ్ సినిమాలపై ఆ మేరకు పెద్ద పంచ్ పడిపోతోందన్నది డిస్ట్రిబ్యూటర్ల వాదన. పైగా నాలుగు వారాల గ్యాప్‌లోనే డిజిటల్ లో అందుబాటులోకొస్తుంటే థియేటర్లకు వెళ్లే వాళ్ల సంఖ్య తగ్గిపోవడం పెను ప్రమాదం కొనితెస్తోందన్న వాదన వినిపిస్తోంది.ప్రస్తుతం దీనిపై టాలీవుడ్ లో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు పంపిణీదారులు ఫిలింఛాంబర్ ప్రముఖులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. అయితే డిజిటల్ రైట్స్ రూపంలో మూడో వంతు పెట్టుబడి వెనక్కి వస్తున్నప్పుడు ఆ మేరకు నిర్మాతలు ఎంతవరకూ దిగొస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదివరకూ రంగస్థలం - భరత్ అనే నేను లాంటి భారీ చిత్రాలు డిజిటల్ లో రిలీజయ్యాయి. అయితే డిజిటల్ రిలీజ్ కి ముందే ఈ సినిమాల వల్ల పంపిణీదారు సేఫ్ జోన్ లోకి రావడంతో అంత పెద్ద రచ్చ జరగలేదు కానీ ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలకు మాత్రం చిక్కొచ్చిపడిందని పంపిణీదారు వాదించబోతన్నారుట.

మునుముందు రిలీజ్‌కి రానున్న శర్వా `పడిపడి లేచే మనసు` - వరుణ్ తేజ్ `అంతరిక్షం 9000 కెఎంపిహెచ్` చిత్రాల థియేటర్ రిలీజ్ హక్కుల్ని - డిజిటల్ హక్కుల్ని భారీ మొత్తాలకు నిర్మాతలు అమ్మేశారు. అయితే ఇవి అమెజాన్ లో నెలలోపే రిలీజైతే తమకు తీరని నష్టాలు తప్పవన్న ఆందోళనలో పంపిణీదారులు ఉన్నారట. కొందరు పంపిణీదారులు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ సమస్యను ఫిలింఛాంబర్ సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తుందనే భావిస్తున్నారు. ఒకవేళ డిజిటల్ రిలీజ్ ఇంకాస్త ఆలస్యంగా చేసుకునేలా ఒప్పందం జరుగుతుందేమోనన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.