Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో అలా.. టాలీవుడ్ లో ఇలా?

By:  Tupaki Desk   |   4 Nov 2015 5:30 PM GMT
బాలీవుడ్ లో అలా.. టాలీవుడ్ లో ఇలా?
X
బాలీవుడ్ తో టాలీవుడ్ ను పోల్చలేం. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలుండవు. సినిమాల విషయంలో అంటే.. మార్కెట్ విస్తృతి.. బడ్జెట్ లాంటివి చాలానే ఉంటాయనుకొని సర్దుకుపోవచ్చు. కానీ.. కొన్ని సాంకేతిక అంశాలు.. వ్యక్తిగత అంశాలు చూసినప్పుడు అస్సలు సంబంధమే ఉండనట్లుగా కనిపిస్తుంది. చాలామంది బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో చాలా ప్రొఫెషనల్ గా ఉంటారన్న మాట వినిపిస్తుంటారు. ఇంతకీ ఆ ప్రొఫెషనలిజం ఏమిటో వివరంగా చెప్పండంటే చెప్పే నాథుడే కనిపించడు.

ఇంతకీ.. రెండింటి మధ్య మార్కెట్.. బడ్జెట్ లాంటి వ్యత్యాసాలే తప్పించి.. రెండూ సినిమాలు తీసే పరిశ్రమలే కదా.. అంటే అవుననే చెప్పాలి. కానీ.. కొన్ని విషయాలకు సంబంధించి లోతుగా చూస్తే మా సిత్రంగా అనిపిస్తాయి. ఎందుకిలా అనిపించే చాలా విషయాలకు సమాధానాలు చెప్పే వారు కనిపించరు. ఇంతకీ జవాబులు దొరకని ఆ ప్రశ్నలేంటో చూసేద్దామా?

1. భారీ చిత్రాలకు సైతం క్లాప్ కొట్టే సమయంలోనే రిలీజ్ డేట్ చెప్పేయటం బాలీవుడ్ లో కామన్. కానీ.. పెద్ద పెద్ద హీరోల చిత్రాలు కూడా రిలీజ్ డేట్లు మారిపోవటం ఈ మధ్య కామన్ అయిపోయింది. ఎందుకిలా అంటే.. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటారు. బాలీవుడ్ కి లేని టెక్నికల్ ప్రాబ్లమ్స్ టాలీవుడ్ కే ఎందుకు ఉంటాయంటారు..?

2. బాలీవుడ్ టాప్ హీరోలు మొదలు.. ప్రముఖుల వరకూ ఏదైనా వివాదాస్పద అంశం మీద తమ అభిప్రాయాన్ని చెప్పేస్తుంటారు. కానీ.. టాలీవుడ్ లో ప్రముఖ హీరోల మొదలు.. చిత్ర ప్రముఖుల వరకూ ఎవరూ.. ఏ విషయం మీదా ఎందుకు పెదవి విప్పరు..?

3. తమకున్న వ్యక్తిగత సమస్యల్ని బోల్డ్ గా బయటపెట్టేస్తుంటారు బాలీవుడ్ ప్రముఖులు. కానీ.. టాలీవుడ్ ప్రముఖులెవరూ తమ సమస్యల్ని చెప్పేందుకు అస్సలు ఇష్టపడరు.

4. బాలీవుడ్ లో కుర్ర హీరోల మొదలు సీనియర్లు వరకూ సహ నటీమణులతో ప్రేమాయణాలు సాగించటం.. ఓపెన్ గా తిరగటం లాంటివి కనిపిస్తాయి. కానీ.. టాలీవుడ్ హీరోల్లో మాత్రం అలాంటివి పెద్ద కనిపించవెందుకు?

5. బాలీవుడ్ లో ప్రముఖ నటీనటులు పెళ్లిళ్లు కామన్. కానీ.. టాలీవుడ్ లో అలాంటివి అస్సలు కనిపించవే.

6. థర్టీ ఫైవ్.. ఫార్టీకి దగ్గర పడుతున్నా.. గ్లామర్ ఒలబోసే హీరోయిన్లు బాలీవుడ్ లో కనిపిస్తారు. కానీ.. టాలీవుడ్ లో అలాంటి పరిస్థితే కనిపించదే.

7. పెళ్లి అయి పిల్లల్ని కన్న వారి మొదలు.. పెళ్లి అయిన టాప్ హీరోయిన్లను సైతం కథానాయికిగా కనిపిస్తారు. టాలీవుడ్ లో అలాంటి వ్యవహరం మచ్చుకి కనిపించదెందుకు?

8. పెళ్లిళ్లు.. ఫంక్షన్లు.. చావులు ఇలా వేటికైనా బాలీవుడ్ లో హీరోయిన్లు బాగానే కనిపిస్తుంటారు. కానీ. టాలీవుడ్ లో అలాంటి పరిస్థితి ఎందుకు ఉండదు..?

9. మల్టీ స్టార్ ఫిలింస్ లో యాక్ట్ చేయటానికి టాప్ హీరోలు కూడా బాలీవుడ్ లో ఓకే చెప్పేస్తారు.. టాలీవుడ్ లో అలాంటి ‘సినిమా’నే కనిపించదెందుకు?

10. దేశాన్ని కదిలించే ఘటనలు జరిగినప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు రియాక్ట్ అవుతుంటారు. అదేం చిత్రమో టాలీవుడ్ హీరోయిన్లు నోట్లో నుంచి మాటలు రాని వారిగా ఉండిపోతారు. ఎక్కడా పెద్దగా కనిపించరెందుకు?