Begin typing your search above and press return to search.

కామెంట్: బాహుబలి.. శివ.. అక్కడే తేడా

By:  Tupaki Desk   |   23 July 2016 5:30 PM GMT
కామెంట్: బాహుబలి.. శివ.. అక్కడే తేడా
X
మొన్న పాత తరం హీరోయిన్‌ జమున.. నేడు కైకల సత్యానారాయణ.. వీళ్ళందరికీ బాహుబలి నచ్చిందా అనే ప్రశ్న అడిగితే.. ఆ సినిమాలో ఏముంది నచ్చడానికి అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. అంటే వీరికి బాహుబలి నచ్చలేదనమాట. ఈ సందర్భంలో చాలామంది సినిమా విమర్శకులకు వచ్చిన ఒక సందేహం ఏంటంటే.. ''బాహుబలి'' వసూళ్ళపరంగా ఉతికి ఆరేసి రికార్డులు సృష్టించింది కాని.. రామ్ గోపాల్ వర్మ తీసిన ''శివ'' సినిమా తరహాలో టాలీవుడ్‌ చరిత్రను రెండు పార్టులుగా డివైడ్ చేయలేకపోయింది. కారణం?

బాహుబలిలో అసలు కొత్తరకం స్ర్కీన్ ప్లే కాని.. కొత్తరకం కథ కాని.. అలాగే ఏమన్నా వినూత్నమైన విజువల్స్ కాని లేకపోవడమే.. అంటున్నారు సినిమా ఎక్సపర్టులు. కాకపోతే భారీ స్థాయి గ్రాఫిక్స్ ఉండటం వలన సినిమా రేంజు ఎక్కడికో వెళ్ళిపోయిందట. అదే శివ సినిమా వచ్చినప్పుడైతే.. ఫైటింగుల స్టయిలు మారింది.. హీరోయిజమ్ తీరు మారింది.. హీరోలకు కొత్త వెపన్ సృష్టించాలనే ఆలోచన వచ్చింది.. సటిల్ కామెడీ.. స్డెడీ కామ్ ను వాడటం.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లేని సీన్లు.. కట్స్ లేకుండా లెంగ్తీ షాటులో చాలా యాక్షన్‌ చూపించడం.. ఇలా కొత్తవి అనేకం మన దర్శకులు నేర్చుకున్నారు. ఏకంగా వీరు సినిమాలను తీర్చిదిద్దే రూపురేఖలే మారిపోయాయ్. కాని బాహుబలి సినిమాను చూసి అలా ఎవ్వరూ ఏమీ పెద్దగా నేర్చుకున్నదేం లేదు. కాకపోతే బాగా డబ్బులు పెట్టి ఓ మూడ్నాలుగు సంవత్సరాలు కేటాయిస్తేనే ఇలాంటి సినిమాలు చేయగలుగుతాం అని తెలుసుకున్నాం.

నిజంగానే ఈ వెటరన్ తారలు చెప్పినట్లు బాహుబలి సినిమాలో కథ ఏమీ లేదు. కాకపోతే విజువల్ ఎఫెక్టులు మాత్రం అదిరిపోయాయ్‌. మన భారతీయ సినిమా స్టాండర్డ్ కు అవి చాలా ఎక్కువేలే. అందుకే ఇప్పటి యూత్ కు అవన్నీ బాగా నచ్చేశాయి.. అంటున్నారు క్రిటిక్స్ కూడా. పైగా ఇలాంటి జానపద సినిమాలు ఈ కొత్త తరంలో రానే రావట్లేదు. యూత్ కు సినిమా నచ్చడానికి అది కూడా ఒక కారణం. కాని ఆల్రెడీ విఠలాచార్య డైరక్షన్ లో ఇలాంటి సినిమాలు డజన్లు డజన్లు చూసేసిన పాత తరానికి కిక్‌ ఎందుకు వస్తుంది? రాదులే.