Begin typing your search above and press return to search.

బాలయ్య చివరికి ఎంత తెచ్చినట్లు?

By:  Tupaki Desk   |   13 Feb 2016 10:07 AM GMT
బాలయ్య చివరికి ఎంత తెచ్చినట్లు?
X
నందమూరి బాలకృష్ణకు సంక్రాంతికి భలే కలిసొచ్చే సీజన్. సమరసింహారెడ్డి - నరసింహనాయుడు లాంటి బాలయ్య బ్లాక్ బస్టర్లు సంక్రాంతికే వచ్చాయి. అందుకే ఈ సీజన్లో సినిమా రిలీజ్ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తాడు బాలయ్య. ఈ సంక్రాంతికి ఎంత పోటీ ఉన్నా కూడా తగ్గకుండా ‘డిక్టేటర్’ రిలీజ్ చేయడానికి కారణమదే. ఐతే తక్కువ పోటీలో రిలీజ్ చేసి ఉంటే ‘డిక్టేటర్’ హిట్టయి ఉండేదేమో కానీ.. మరో మూడు సినిమాలతో ఢీకొట్టడం వల్ల ‘డిక్టేటర్’ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. సంక్రాంతి సినిమాల్లో ముందు రేసు నుంచి నిష్క్రమించింది బాలయ్య సినిమానే. అక్కడక్కడా కొన్ని థియేటర్లలో ఆడుతున్నప్పటికీ అది నామమాత్రమే. డిక్టేటర్ పరుగు దాదాపుగా ఆగిపోయింది. ఫైనల్ కలెక్షన్ల లెక్క తేలిపోయింది.

డిక్టేటర్ ఫుల్ రన్ లో రూ.35.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. షేర్ రూ.20.6 కోట్ల దగ్గర ఆగిపోయింది. షేర్ చూస్తే ఈ సినిమాను ఏవరేజ్ అనడానికి కూడా సందేహించాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.27 కోట్ల దాకా అమ్మారు. అంటే బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఆగిపోయిందన్నమాట ‘డిక్టేటర్’. ఒక్క రాయలసీమలో తప్ప బయ్యర్లు దాదాపుగా అన్ని చోట్లా నష్టపోయారు. కాకపోతే భారీ నష్టాలు లేకపోవడం ఊరట. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఏరియా అయిన నైజాంలో ‘డిక్టేటర్’ రూ.4.1 కోట్లు మాత్రమే వసూలు చేయగా.. చిన్నదైన సీడెడ్లో (రాయలసీమ)లో రూ.4.7 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. యుఎస్ లో డిక్టేటర్ కలెక్షన్లు లెక్కలోకి కూడా తీసుకోలేనంత దారుణంగా ఉన్నాయి. అక్కడ పెట్టుబడి అంతా దాదాపుగా ఊడ్చుకుపోయింది.