సినిమా చేశాడు..చదువు కోసం వెళ్లిపోయాడు

Sun Sep 23 2018 14:41:07 GMT+0530 (IST)

తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరో అవుతాడని కొన్నేళ్ల కిందటే కన్ఫమ్ అయింది. ఇందుకోసం అతను విదేశాల్లో శిక్షణ కూడా పొందాడు. ఐతే అతడి అరంగేట్రానికి ఇంకా కొన్నేళ్లు పడుతుందని అనుకున్నారు. కానీ అనుకోకుండా ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో అతను హీరో అయిపోయాడు. చాలా వేగంగా ఈ సినిమా పూర్తి చేసేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా తర్వాత ధ్రువ్ ఏం చేస్తాడు.. అతడి రెండో సినిమా ఎవరితో ఉంటుంది అని అందరూ చర్చించుకుంటుంటే అతను మాత్రం సినిమా నుంచి బ్రేక్ తీసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా విక్రమే వెల్లడించాడు.‘వర్మ’ సినిమా పని పూర్తి చేశాక ధ్రువ్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నట్లు విక్రమ్ వెల్లడించాడు. విదేశాల్లో ఒక కోర్సు చేయాలని ధ్రువ్ ముందే అనుకున్నాడని.. అనుకోకుండా ‘వర్మ’ చేయాల్సి వచ్చిందని.. ఐతే దీని తర్వాత చదువు పూర్తి చేసి తిరిగి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడని.. త్వరలోనే అతను విదేశాలకు పయనమవుతాడని విక్రమ్ చెప్పాడు. ఒకసారి యాక్టింగ్ పురుగు కుట్టాక.. గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాక మళ్లీ చదువు మీదికి మనసు మళ్లడం కష్టమే. కానీ విక్రమ్ తనయుడు మాత్రం ఆశ్చర్యకర రీతిలో తొలి సినిమా తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నాడు. మరి అతను అక్కడి నుంచి ఎప్పుడు తిరిగొస్తాడో.. రెండో సినిమా ఎప్పుడు.. ఎవరితో చేస్తాడో చూడాలి. ‘సేతు’ సినిమాతో విక్రమ్ కు నటుడిగా ప్రాణం పోసిన బాలానే ధ్రువ్ అరంగేట్ర సినిమా ‘వర్మ’ను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.