కోలీవుడ్ కాంబినేషన్ అదిరిపోయిందిగా!

Wed Jan 11 2017 12:34:32 GMT+0530 (IST)

తమిళ సినీ పరిశ్రమ కోలీవుడ్ లో సరికొత్తగా తెరకెక్కుతున్న ఓ చిత్రానికి సంబంధించి ఆసక్తికర కాంబినేషన్ వినిపిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తన తర్వాతి చిత్రాన్ని హిట్ డైరెక్టర్ మురుగదాస్ తో చేయబోబుతున్నాడు. తుపాకి - కత్తి వంటి బ్లాక్ బస్లర్ చిత్రాలను అందించిన ఈ జోడి మళ్లీ జత కట్టిందంటే మరో హిట్టే కదా అని తంబీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్‌కు మరో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా జత కట్టాడంటే... ఆ కాంబినేషన్ మరింతగా అదిరిపోవడం ఖాయమేగా.

విజయ్ - ధనుష్ కలిసి నటిస్తున్నారా? ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడా? అన్న అంశాలపై ఇప్పుటు కోలీవుడ్ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే మురుగదాస్ చేతుల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ ఒక్కడే హీరోగా కనిపిస్తాడట. మరి ధనుష్.. కాంబినేషన్ ఏమిటంటే... ఆ చిత్రానికి అతడు నిర్మాతగా వ్యవహరించనున్నాడట. వండర్ బార్ ఫిలిమ్స్ బేనర్ పై ధనుష్ చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాను హీరోగా నటించే చిత్రాలతో పాటు ఇతర హీరోల చిత్రాలను కూడా ధనుష్ ఈ బ్యానర్ పై తీస్తున్నాడు.

అయితే విజయ్ లాంటి స్టార్ హీరోతో సినిమా మాత్రం ఇప్పటిదాకా చేయలేదు. దీంతో ఈ త్రిబుల్ కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకుముందు మురుగ-విజయ్ కాంబినేషన్లో ‘కత్తి’ సినిమాను ధనుషే నిర్మించాల్సింది. కానీ ఆ చిత్రం లైకా ప్రొడక్షన్స్ వాళ్లకు వెళ్లిపోయింది. ఈసారి మాత్రం ధనుష్ ఛాన్స్ వదులుకోవట్లేదు. మహేష్ బాబు సినిమా మీదే ఇంకో మూడు నెలలు పని చేస్తాడు మురుగదాస్. ఆ తర్వాత విజయ్ సినిమాకు స్క్రిప్టు పూర్తి చేయడానికి కొన్ని నెలలు పడుతుంది. తాజాగా ‘భైరవ’ సినిమాను పూర్తి చేసిన విజయ్.. ‘తెరి’ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో వచ్చే నెలలో ఓ సినిమాను మొదలుపెడతాడు. అదవ్వాగానే మురుగదాస్ సినిమా చేస్తాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/