దడ పుట్టిస్తున్న వడ చెన్నై

Sat Jun 23 2018 16:18:02 GMT+0530 (IST)

కొందరు దర్శకులు సినిమాలు ఎంత ఆలస్యంగా తీసినా ఆ ఎదురుచూపుకు ఒక అర్థం కల్పించే అవుట్ ఫుట్ నే ఇస్తారు. వీళ్లకు కాలంతో పని లేదు. ఎప్పుడు విడుదల చేస్తామా అనే లెక్కలకు అతీతంగా ఉంటారు. కానీ వచ్చాక మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లకు  విమర్శకుల ప్రశంశలకు అంతు లేకుండా చూసుకుంటారు. తెలుగులో రాజమౌళిని ఆ కోవలోకి తీసుకుంటే హిందీలో రాజ్ కుమార్ హిరానీని తమిళ్ లో శంకర్ ని  ఉదాహరణగా చెప్పొచ్చు. మూడేళ్ళకో లేక ఐదేళ్లకు ఒకటి తీసే ఈ దర్శకులు ప్రేక్షకులను మెస్ మరైజ్ చేయటంలో వీరికి వీరే సాటి. వీరి వరసలో మరో దర్శకుడు కూడా ఉన్నాడు. అతనే వెట్రిమారన్.విసారనై సినిమా  తో ఆస్కార్ మెట్ల దాకా వెళ్లి వెనక్కు వచ్చిన ఈ విలక్షణ దర్శకుడు ధనుష్ తో తీస్తున్న చిత్రం వడ చెన్నై. షూటింగ్ లో ఉన్న మూవీని  భారీ బడ్జెట్ తో  ధనుష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. చెన్నైలో ఒక ప్రాంతంలో జరిగిన నిజ జీవిత సంఘటనలను రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో ఒళ్ళు గగుర్పొడిచే రేంజ్ లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. సహజత్వానికి పెద్ద పీఠ వేసే వెట్రిమారన్ గతంలో ధనుష్ కి ఆడుకాలం అనే అవార్డు సినిమా ఇచ్చాడు. అది తెలుగులో పందెం కోళ్లుగా డబ్బింగ్ చేసి విడుదల చేశారు కానీ నేటివిటీ సమస్య వల్ల మనవాళ్లకు కనెక్ట్ కాలేదు.

నార్త్ చెన్నై జీవన విధానాన్ని నేపధ్యంగా తీసుకున్న వడ చెన్నైలో ధనుష్ నేషనల్ లెవెల్ క్యారమ్స్ ప్లేయర్ గా నటిస్తున్నాడు. సముద్రపు దొంగగా అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది అనే పాయింట్ మీద నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్-ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు . ప్రస్తుతానికి రెండు భాగాలు ఖరారు అయ్యాయి. మూడో భాగం కూడా వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్ . సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో  ఉంది టీమ్. కోలీవుడ్ లోనే అత్యంత అరుదైన ప్రయోగంగా దీని గురించి చెప్పుకుంటారని చెన్నై మీడియా దీని గురించి చాలా ప్రత్యేకంగా ప్రచారం చేస్తోంది.

తమిళ సినిమా స్టాండర్డ్ ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే సినిమా గా దీన్ని తీర్చిదిద్దుతున్నట్టు పలు కథనాలు కూడా ప్రచురిస్తున్నాయి. భిన్నమైన ప్రయోగాలతో దూసుకుపోతున్న ధనుష్ రఘువరన్ తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేదు. తమిళ్ లో బాగా ఆడిన సినిమాలు కూడా ఇక్కడ ప్రతికూల ఫలితం ఇస్తున్నాయి . వడ చెన్నై నేపధ్యం తమిళ ప్రజలదే అయినప్పటికీ అందరికి కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ ప్లే లో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. అంచనాలకు అనుగుణంగా సినిమా ఉంటె మాత్రం వడ చెన్నై ధనుష్ కి టాప్ మూవీ గా నిలిచిపోతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి.