Begin typing your search above and press return to search.

ధనుష్.. ఇంకో సెన్సేషన్ కు రెడీ

By:  Tupaki Desk   |   30 July 2015 11:47 AM GMT
ధనుష్.. ఇంకో సెన్సేషన్ కు రెడీ
X
నటుడిగా గత కొన్నేళ్లలో ధనుష్ ఎలా ఎదుగుతూ వెళ్లాడో చూస్తూనే ఉన్నాం. రాన్జానా, షమితాబ్ లాంటి సినిమాలతో బాలీవుడ్ జనాల్ని కూడా మంత్ర ముగ్ధుల్ని చేశాడు. ఇక తమిళంలో అతడి సినిమాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య రఘువరన్ బీటెక్ సినిమా చూశాక తెలుగు ప్రేక్షకులు కూడా అతడికి ఫ్యాన్స్ అయిపోయారు. నటుడిగా అతడి ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపిస్తూ దూసుకెళ్తున్న ధనుష్ నిర్మాతగానూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుండటం విశేషం. ధనుష్ నిర్మాణంలో తెరకెక్కిన ‘కాకా ముట్టై’ గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. విడుదలకు ముందే రెండు జాతీయ అవార్డులు సహా పలు చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన ఆదరణ లభించింది.

ధనుష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఇంకో సినిమా కూడా ఇలాంటి సెన్సేషనే క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ధనుష్ కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘ఆడుగళం’ డైరెక్టర్ వెట్రిమారన్ నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి ‘విసారణై’ అనే సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. నలుగురు అమాయక కుర్రాళ్లను అదుపులోకి తీసుకుని పోలీసులు చిత్రహింసలకు గురి చేసి ఎలా విచారిస్తారన్న కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆ మధ్య ట్రైలర్ విడుదల చేస్తే అది చూసి జనాలకు మతిపోయింది. వెట్రి మారన్ మళ్లీ ఓ గొప్ప సినిమా తీశాడన్న ఫీలింగ్ కలిగింది. ఆ అంచనాలకు తగ్గట్లే.. విసారణై వెనిస్ ఫిలిం ఫెస్టివల్లో కాంపిటీటివ్ కేటగిరీలో ప్రదర్శనకు ఎంపికైంది. తమిళ సినిమా చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి సినిమా ఇదే. ఈ విషయాన్ని గర్వంగా ట్విట్టర్లో ప్రకటించాడు ధనుష్. ఇంకా పలు చిత్రోత్సవాలకు ఈ సినిమాను పంపిస్తున్నామని ధనుష్ వెల్లడించాడు. కాకా ముట్టై తరహాలోనే ముందు అవార్డులు కొల్లగొట్టి.. ఆ తర్వాత ప్రేక్షకుల ప్రశంసలూ అందుకునేలా కనిపిస్తోంది విసారణై.