Begin typing your search above and press return to search.

డబ్బింగ్ నిర్మాత పైత్యం చూడండి

By:  Tupaki Desk   |   28 May 2016 7:11 AM GMT
డబ్బింగ్ నిర్మాత పైత్యం చూడండి
X
ఒక సినిమా తెలుగులో సూపర్ హిట్టవుతుంది. దాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తారు. మళ్లీ ఆ సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తారు. మన జనాలకు తమిళ సినిమాలకు ఎంత గురి ఉన్నా కూడా ఇది మరీ అతి కదా. ఇంతకుముందు నరసింహనాయుడు.. ఇడియట్ లాంటి సినిమాల విషయంలో ఇలాంటి పైత్యమే చూపించారు డబ్బింగ్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రయత్నమే జరుగుతోంది.

‘రఘువరన్ బీటెక్’ సినిమాతో ధనుష్ తెలుగులో ఓ మోస్తరుగా ఫాలోయింగ్ సంపాదించుకున్న నేపథ్యంలో వరుసగా అతడి పాత సినిమాలన్నింటినీ తెలుగులోకి దించేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఏడెనిమిదేళ్ల కిందట చేసిన ‘ఉత్తమ పుత్తిరన్’ను కూడా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఇది మన దగ్గర్నుంచి వెళ్లిన కథే. రామ్-జెనీలియా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రెడీ’కి ఇది రీమేక్. తమిళంలో కూడా బాగానే ఆడింది.

ధనుష్ నటించిన కొన్ని కొత్త సినిమాలు కూడా పెండింగ్‌ లో ఉండగా.. ఈ పాత సినిమాను ‘నారదుడు’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు ఓ నిర్మాత. ఇదేదో కొత్త సినిమా అయినట్లు కలరింగ్ ఇస్తున్నాడు. తమిళ వెర్షన్లో సైతం జెనీలియానే కథానాయికగా నటించింది. ఆమె సౌత్ లో సినిమాలు మానేసి చాలా ఏళ్లయిందన్న సంగతి అర్థమైనా ఈ పాత సినిమాను ఇప్పుడు తెచ్చి కొత్తగా రుద్దే పని చేయరు. తెలుగులో తమన్నా చేసిన క్యామియో రోల్ ను శ్రియ చేసింది. మరి ఈ సినిమాను తెలుగోళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.