అజ్ఞాతవాసి కంటే ముందు 'దమ్ము'

Fri Jan 12 2018 23:00:01 GMT+0530 (IST)

భారీ అంచనాల మధ్య రిలీజైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా అజ్ఙాతవాసి ఆ అంచనాలను అందుకోలేక అభిమానులను నిరాశ పరిచింది. దానికితోడు రిలీజ్ కు ముందు నుంచి వచ్చిన కాపీ వివాదాలు సినిమా విడుదల తరవాత సమసిపోక పోగా పెరిగాయి. ఫ్రెంచి మూవీ లార్గోవించ్ కథతో అజ్ఙాతవాసి తీశారంటూ ఆ మూవీ డైరెక్టర్ జెరోమ్ సల్లే అనడమే కాదు.. దీనిపై సెటిల్మెంట్ చేసుకోవాల్సి ఇంకా ఉందంటూ కామెంట్ కూడా చేశాడు.తాజాగా అజ్ఙాతవాసి కథపై టాలీవుడ్ లో ఓ కొత్త న్యూస్ వినిపిస్తోంది. అజ్ఙాతవాసి కథకు మూలం ఏడేళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమా అని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. అజ్ఙాతవాసిలో తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడటానికి ఎక్కడో దూరంలో ఉన్న కొడుకు బయటకు వస్తాడు. దమ్ములో కూడా సేమ్ కాన్సెప్ట్. హీరో తండ్రికి దూరంగా ఎక్కడో సింగిల్ గా పెరుగుతాడు. కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి తిరిగి ఇంటికి వస్తాడు. అక్కడా.. ఇక్కడా పెరిగి పెద్దయ్యేంత వరకు హీరో తన ఐడెంటిటీ బయటపెట్టడు. కాకుంటే దమ్ములో హీరో విలేజ్ కు వస్తే.. అజ్ఙాతవాసిలో సిటీకి వస్తాడు.  

కాకుంటే ఇక్కడ గమనించాల్సిన పాయింటేంటంటే లార్గో వించ్ 2008లో వచ్చింది. దమ్ము ఆ తరవాత 2011లో వచ్చింది. ఈ లెక్కన దమ్ము కూడా లార్గో వించ్ కు కాపీగానే పరిగణించాల్సి ఉంటుంది. విచిత్రం ఏమిటంటే లార్గో వించ్.. దమ్ము.. ఇప్పుడు అజ్ఙాతవాసి మూడూ కూడా ఫ్లాపులే. ఫ్లాపయిన పిక్చర్లను ఎన్ని రకాలుగా తీసినా ఫ్లాపే అవుతుందని కొందరు నెటిజన్లు సెటైరిక్ గా అంటున్నారు. నిజమే కదా..