Begin typing your search above and press return to search.

భక్తి అంటే బారెడు దూరమా? భారమా?

By:  Tupaki Desk   |   7 March 2017 5:41 AM GMT
భక్తి అంటే బారెడు దూరమా? భారమా?
X
ఒకప్పుడు భక్తి చిత్రాలంటే టాలీవుడ్ లో మహా క్రేజ్. కొత్త కాన్సెప్ట్ తో ఏ భక్తిరస చిత్రం రిలీజ్ అయినా.. థియేటర్లు నిండిపోయేవి. సినిమా హాళ్లలోనే పూనకాలు తెచ్చేసుకునేవారు ప్రేక్షకులు. గ్రాఫిక్స్ అందుబాటులోకి వచ్చాక.. వీటి రేంజ్ మరింతగా పెరిగింది.

కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారిపోయినట్లుగా కనిపిస్తోంది. గత నెలలో విడుదలైన నాగార్జున మూవీ ఓం నమో వెంకటేశాయ.. భక్తి చిత్రాల్లోనే కాదు.. మొత్తం టాలీవుడ్ లోనే అతి పెద్ద ఫ్లాప్ అంటున్నారు. పెట్టుబడిలో నాలుగోవంతును కూడా బయ్యర్లకు తెచ్చిపెట్టలేకపోయిందీ మూవీ. మౌత్ టాక్ నుంచి రివ్యూల వరకూ అన్నీ బాగున్నా.. ఎందుకు జనాలకు ఎక్కలేదన్నదే ఆశ్చర్యకరమైన విషయం.

గతేడాది మహేష్ నటించిన బ్రహ్మోత్సవం పరిస్థితీ ఇంతే. ఇది భక్తిచిత్రం కాకపోయినా.. సెకండాఫ్ అంతా పుణ్యక్షేత్రాల చుట్టూనే తిప్పుతారు. ఒకేసారి అన్ని పుణ్యక్షేత్రాలు చూసే అవకాశం అన్న పాయింట్ కూడా జనాలను ఆకట్టుకోలేకపోయింది.

దీనికి ముందు నాగ్- కె. రాఘవేంద్ర రావుల కాంబినేషన్ లో వచ్చిన షిరిడి సాయి కూడా పెద్ద ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మంచి పాటలతో ఆకట్టుకున్నా.. ఫలితం మాత్రం షాక్ కొట్టించేసింది.

బాలకృష్ణ నటించిన శ్రీ రామరాజ్యం.. పాండురంగడు చిత్రాల పరిస్థితి కూడా ఇంతే. శ్రీరామ రాజ్యం మూవీకి సూపర్బ్ టాక్.. యాక్టర్స్ కి మంచి పేరు అయితే వచ్చింది కానీ.. ఫలితం మాత్రం నిరుత్సాహకరమే.

ఇదంతా చూస్తుంటే.. అసలు జనాలు భక్తి రస చిత్రాలకు దూరంగా ఉంటున్నారా.. లేకపోతే ఈ భక్తి సినిమాలను చూడటం భారంగా భావిస్తున్నారా? మంగళవారాలూ శనివారాలూ గుళ్ళలో భారులు తీస్తున్న సగం జనాభా ఈ సినిమాలను చూసినా కూడా ఇవి సూపర్ హిట్టే అవుతాయి. వారందరూ ఏమవుతున్నారు మరి? బాగోని సినిమా ఆడకపోయినా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ బాగుంది అని చూసిన కొందరు జనాలు చెప్పిన భక్తి సినిమా కూడా ఇప్పుడు ఆడే పరిస్థితి కనిపించడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/