‘బిగ్ బాస్’ ఫైనల్లో బిగ్ సర్ప్రైజ్

Sat Sep 23 2017 21:54:20 GMT+0530 (IST)

అనూహ్య రీతిలో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’కు ఇంకొక్క రోజులో తెరపడబోతోంది. ఆదివారం రాత్రికి ‘బిగ్ బాస్’ తొలి సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. షో అంచనాల్ని మించి విజయం సాధించిన నేపథ్యంలో చివరి ఎపిసోడ్ ను మరింత జనరంజకంగా.. ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు సన్నాహాలు పూర్తి చేశారు.ఏకంగా నాలుగు గంటల పాటు ‘బిగ్ బాస్’ గ్రాండ్ ఫినాలె ఎపిసోడ్ సాగుతుందని సమాచారం. ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఇతర పార్టిసిపెంట్లను కూడా రప్పించి.. టైటిల్ కోసం పోటీలో ఉన్న హరితేజ.. అర్చన.. ఆదర్శ్.. నవదీప్.. శివబాలాజీలతో కలిపించి చివరి ఎపిసోడ్లో రకరకాల కార్యక్రమాలు చేయించబోతున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ హంగామా ఎలాగూ ఉంటుంది.

ఇవి కాక ‘బిగ్ బాస్’ ఫైనల్లో ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంటుందన్నది తాజా సమాచారం. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లైవ్ ఈవెంట్ చేయబోతున్నాడట ఆదివారం. దేవి లైవ్ మ్యూజిక్ షో చేస్తే ఆ సందడి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిందేముంది. ఎన్టీఆర్ కు అతను జత కలిశాడంటే ఎనర్జీ పీక్స్ లో ఉంటుంది. కాబట్టి షోకు దేవి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ అవుతుందనడంలో సందేహం లేదు. ‘బిగ్ బాస్’లో ఇప్పటిదాకా చూసిన ఎపిసోడ్లన్నీ ఒకెత్తయితే.. ఫైనల్ ఎపిసోడ్ మరో ఎత్తు అవుతుందని భావిస్తున్నారు.