ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టేసేలా ఉన్నాడే

Wed Oct 11 2017 07:00:01 GMT+0530 (IST)

సౌత్ లో మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఊర మాస్ సాంగ్ అయినా స్వీట్ మెలోడీ సాంగ్ అయినా దేనికదే సాటి అన్నట్లు సంగీతాన్ని అందిస్తారు. డిఎస్పీ అని అభిమానులు ముద్దుగా పిలిపించుకునే ఈ యువ సంగీత దర్శకుడు అతి తక్కువ కాలంలోనే చాలా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా బీట్ సాంగ్స్ లో దేవి స్టైల్ చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అయితే ప్రేక్షకులకి పునకాలు తెప్పించగలడు. అలాగే స్వీట్ మ్యూజిక్ తో కన్నీళ్లను తెప్పించగలడు.ఇప్పటివరకు దేవి మ్యూజిక్ అందించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా మ్యూజిక్ పరంగా ఎదో ఒక పాట మాత్రం సినిమా విడుదలకు ముందు హైప్ తెస్తోంది.

ఈ ఏడాది ఖైదీ నెంబర్ 150 తో మొదలు పెట్టి మ్యూజిక్ తో హ్యాట్రిక్ కొట్టి మరో సారి తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. నేను లోకల్ - రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత వచ్చిన డీజే - జయజనాకి నాయక అండ్ జై లవకుశ సినిమాలు కూడా మ్యూజిక్ పరంగా చాలా పెద్ద హిట్ అయ్యాయి.

ఈ ఏడాది దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఆరు సినిమాలు రిలీజ్ అయ్యి అన్ని సినిమాల్లో పాటలు మంచి హిట్ అయ్యాయి. దేవి ఎంత బిజిగా ఉన్నా బిజిఎమ్ ని కూడా తనే చేసేవారు. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ మరో ఐదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రామ్ - ఉన్నది ఒక్కటే జిందగి సినిమాలోని రెండు పాటలను రిలీజ్ చేసి సినిమాకి హైప్ తెచ్చాడు. నాని - ఎంసీఏ తో పాటు రామ్ చరణ్ - రంగస్థలం 1985 సినిమాకి కూడా వర్క్ చేస్తున్నాడు. అలాగే మహేష్ భారత్ అనే నేను మరియు సుమంత్ అశ్విన్ - నిహారిక కాంబోలో వస్తున్న హ్యాపీ వెడ్డింగ్ సినిమాలకు కూడా దేవి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఒక విధంగా చూస్తుంటే.. ఆల్రెడీ డబుల్ హ్యాట్రిక్ కొట్టేసిన దేవిశ్రీ.. ఖచ్చితంగా ఉన్నది ఒక్కటే జిందగి తరువాత రంగస్థలం మరియు భరత్ అను నేను పాటలను కూడా ఈ డిసెంబర్లోనే విడుదల చేస్తే.. ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడు కదూ!!