Begin typing your search above and press return to search.

సిరివెన్నెలకు సర్ ప్రైజ్ ఇచ్చిన సూపర్ మచ్చి..

By:  Tupaki Desk   |   20 May 2019 1:30 AM GMT
సిరివెన్నెలకు సర్ ప్రైజ్ ఇచ్చిన సూపర్ మచ్చి..
X
దాదాపుగా అందరూ డబ్బు కోసమే పనిచేస్తారు కానీ కొన్ని రంగాలలో ఉండేవారు మాత్రం డబ్బు కోసం మాత్రమే పని చేయరు. గుర్తింపు.. ప్రశంసలు కూడా వారికి ముఖ్యమే. సంగీత సాహిత్య రంగాలలో ఉండేవారికి ఎక్కువగా ఇది వర్తిస్తుంది. నిజానికి డబ్బు సంపాదన కంటే అదే ఎక్కువగా కిక్కిస్తుంది. అయితే ఈ ప్రశంసల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. ఒక క్రికెటర్ ను ఏకంగా సచిన్ టెండూల్కర్ ప్రశంసిస్తే ఎలా ఉంటుందంటే 'ఈ జన్మకు ఇది చాలు' అనిపిస్తుంది. అలానే ఒక యువ నటుడికి కమల్ లాంటి నటదిగ్గజం ప్రశంసలు లభిస్తే కూడా అంతే. ఇక మన తెలుగు సినీ సాహిత్యం విషయానికి వస్తే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆలాంటి ఘనులే. ఆయన ప్రశంసలు అందుకోవడం ఏ పాటల రచయితకైనా ఒక పెద్ద అవార్డు లాంటిది.

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అలాంటి ప్రశంసలే అందుకున్నారట. దేవీ మ్యూజిక్ గురించి అందరికీ తెలిసిందే. అయన స్వరపరిచిన పాటలకు ప్రశంసలు అందుకోవడం కొత్తేమీ కాదు. అయితే ఆయన ప్రశంసలు అందుకుంది సాహిత్యానికి. 'S/o సత్యమూర్తి' సినిమాలో 'సూపర్ మచ్చి' పాట సాహిత్యానికి ఏకంగా సిరివెన్నెల దేవీని ప్రశంసించారట. ఆ పాట విన్న తర్వాత "నాన్నా.. నేను మాస్ పాటలు ఐటమ్ సాంగ్స్ రాయకూడదని అనుకున్నాను. కానీ నీ పాట విన్నాక నాకు మళ్ళీ మాస్ పాటలు రాయాలనే ఆలోచన కలిగింది" అన్నారట. ఈ పాటలో 'సండే సంత కాదా.. మండే ఎండలోన' అనే ప్రాస సిరివెన్నెలకు తెగ నచ్చిందని.. దీనికి ఒక వ్యాసం రాసి ఇస్తానని చెప్పారని దేవీ రీసెంట్ గా వెల్లడించాడు. సిరివెన్నెల గారి ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేనని కూడా చెప్పుకొచ్చాడు.

అయితే ఈ పాటను నిజానికి దేవీ రాయలనుకోలేదట. ట్యూన్ కట్టే సమయంలో పల్లవి వరకూ రాసుకున్నాడట. ఆ ట్యూన్ ను దర్శకుడు త్రివిక్రమ్ కు వినిపిస్తే ఆయనకు తెగ నచ్చిందట. దాంతో మొత్తం పాట రాయమని పట్టుబట్టి రాయించారట. ఆ పాటనే సిరివెన్నెలకు చూపిస్తే ఆయన కూడా ఆశ్చర్యపోయారట. సూపర్ కదా మచ్చి!