Begin typing your search above and press return to search.

తండ్రి కోసం దేవి ఏమేం చేశాడు?

By:  Tupaki Desk   |   14 Feb 2016 5:30 PM GMT
తండ్రి కోసం దేవి ఏమేం చేశాడు?
X
దేవిశ్రీ ప్రసాద్ కు తన తండ్రి సత్యమూర్తి అంటే ఎంతిష్టమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యమూర్తిని దేవిశ్రీ ప్రసాద్ కుటుంబం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. అందులోనూ దేవి సంగీత దర్శకుడిగా మంచి స్థాయి అందుకున్నాక తన తండ్రికి ఏ ఇబ్బందీ, ఏ లోటూ రాకుండా చాలా బాగా చూసుకున్నాడు. తండ్రికి దగ్గరగా ఉండటం కోసం ఇంటిపైనే స్టూడియో కట్టి అక్కడే పని చేశాడు. తెలుగు ఇండస్ట్రీ ఉన్నది హైదరాబాద్ లో అయినా.. దేవి మాత్రం చెన్నై విడిచి రాలేదు. ఇక తండ్రి కోసం అతను ఎంతో చేశాడు. చక్రాల కుర్చీకే పరిచయమైన ఆయన కోసం ప్రత్యేకంగా ఇన్నోవా కారు డిజైన్ చేయించి బహుమతిగా ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి కోసం తానెంతగా తపించిందీ చెబుతూ.. ఈ సంగతులన్నీ వెల్లడించాడు దేవి.

‘‘ప్రతి వ్యక్తి జీవితంలో వారి నాన్నకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వయస్సు మీద పడుతున్నకొద్ది తల్లిదండ్రులతో కలిసి గడిపే సమయం తగ్గిపోతూ ఉంటుంది. కానీ నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే నేను రానివ్వలేదు. చెన్నైలో స్టూడియో పెట్టాలనుకున్నప్పుడు అనేక స్థలాలు పరిశీలించాం. కానీ అమ్మనాన్నలను వదిలి దూరంగా ఉండాలనిపించలేదు. అందుకే ఇంటిపైనే స్టూడియో కట్టా. ఒకప్పటి నాన్న రైటింగ్‌ రూమే నా స్టూడియో. ఏళ్లు గడిచినా నా అలవాట్లు మానలేదు. ప్రతి రోజూ మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్లి అమ్మనాన్నలతో కలిపి లంచ చేసేవాణ్ణి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా.. కంపోజింగ్‌ కానివ్వండి.. పెద్ద పెద్ద డైరెక్టర్లు వేచి ఉండనియ్యండి. ఇక డిన్నరంటరా.. నాన్నతో కబుర్లు చెబుతూ చేయాల్సిందే. 2013లో నాన్న పుట్టిన రోజు ప్రత్యేకంగా చేయాలనుకున్నాం. నాన్న కొద్ది కాలం నుంచి వీల్‌ ఛైర్‌ కే పరిమితమయ్యారు. అందువల్ల బయటకు వెళ్లాలంటే కష్టంగా ఉండేది. అందుకని దిలీప్‌ చాబ్రియాతో మాట్లాడి ఇన్నోవా కారును ప్రత్యేకంగా డిజైన చేసి బహుమతిగా ఇచ్చా. ఇందులో టీవీ, బెడ్‌ ఉంటాయి. నాన్న ఏదైనా ఊరు వెళితే ఈ కారులోనే ప్రయణించేవారు. ఆ కారును బహుమతిగా ఇచ్చినప్పుడు ఆయన కళ్లలో ఆనందం ఇప్పటికీ గుర్తుంది’’ అంటూ ఉద్వేగంగా చెప్పాడు దేవి.