Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'దేవ్'

By:  Tupaki Desk   |   14 Feb 2019 8:03 AM GMT
మూవీ రివ్యూ: దేవ్
X
చిత్రం : 'దేవ్'

నటీనటులు: కార్తి-రకుల్ ప్రీత్-రమ్యకృష్ణ-ప్రకాష్ రాజ్-విఘ్నేష్ కాంత్-అమృత తదితరులు
సంగీతం: హారిస్ జైరాజ్
ఛాయాగ్రహణం: వేల్ రాజ్
నిర్మాత: లక్ష్మణ్ కుమార్
రచన-దర్శకత్వం: రజత్ రవిశంకర్

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ కథానాయకుల్లో కార్తి ఒకడు. ఇంతకుముందు అతను, రకుల్ ప్రీత్ జంటగా నటించిన ‘ఖాకి’ మన ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరూ జంటగా తెరకెక్కిన సినిమా ‘దేవ్’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

దేవ్ (కార్తి) ఒక ఉన్నత కుటుంబానికి చెందిన కుర్రాడు. అందరిలా 5-10 ఉద్యోగాలు చేయడం అతడికి ఇష్టం ఉండదు. ఏదైనా భిన్నంగా, సాహసోపేతంగా చేయాలనుకుంటాడు. మనసుకు నచ్చినట్లు జీవించడంలోనే ఆనందం ఉందని భావిస్తాడు. అలాంటివాడు జీవితాన్ని ఒక పెద్ద కంపెనీకి సీఈవోగా ఉంటూ క్రమ పద్ధతిలో సాగిస్తున్న మేఘనను చూసి ఇష్టపడతాడు. ముందు దేవ్ ను దూరం పెట్టిన మేఘన.. ఆ తర్వాత అతడితో ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఈ ప్రయాణంలో ఈ జంట ఎక్కడిదాకా వెళ్లింది.. మరోవైపు దేవ్ తనకు నచ్చినట్లుగా తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుని తాను అనుకున్నది ఎలా సాధించాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘దేవ్’లో కార్తి-రకుల్ ప్రీత్ లాంటి అందమైన జంట ఉంది. ఇద్దరూ చాలా అందంగా.. ఫ్రెష్ గా కనిపించారు. బాగా నటించారు. ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ‘దేవ్’ పాటలు చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి. హారిస్ జైరాజ్ చాన్నాళ్ల తర్వాత మంచి పాటలిచ్చాడు. వాటి చిత్రీకరణ కూడా బాగుంది. నేపథ్య సంగీతం సైతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా కనిపిస్తుంది. సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఛాయాగ్రహణం ఒకటి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ అనిపిస్తాయి. సినిమా అంతా చాలా రిచ్ గా కనిపిస్తుంది. రాజీ అన్నదే లేదు. ఐతే ఈ అదనపు ఆకర్షణలన్నీ పక్కన పెట్టి అసలు విషయానికి వస్తేనే.. తీవ్ర నిరాశ తప్పదు. ఏమాత్రం కొత్తదనం లేని కథ.. ఎక్కడా ఆసక్తి రేకెత్తించని కథనం.. సరైన కాన్ఫ్లిక్ట్ లేని లవ్ స్టోరీ.. బోరింగ్ సన్నివేశాలు.. మొత్తంగా కలిపి రెండున్నర గంటల బోరింగ్ వ్యవహారంగా మారింది ‘దేవ్’.

‘దేవ్’లో హీరో అడ్వెంచర్స్ ఇష్టపడే కుర్రాడు. అందరిలా సాధారణంగా జీవితాన్ని గడిపేయడం ఇష్టం ఉండదు. దీని గురించి సినిమా ఆరంభంలోనే పెద్ద క్లాస్ పీకుతుంటే.. ఈ కథ కూడా అంత సాధారణంగా ఏమీ ఉండదని.. చాలా అడ్వెంచర్స్ చూడబోతున్నామని అనుకుంటాం. ముందుకు సాగే కొద్దీ చాలా సర్ప్రైజ్ లు ఉంటాయని ఆశిస్తాం. కానీ ఏ సర్ప్రైజ్ లేకుండా సాధారణంగా సినిమాను నడిపించేయడమే పెద్ద సర్ప్రైజ్ అని సినిమా ముగిసే సమయానికి కూడా అర్థం కాదు. సాధారణంగా హీరో ఏ పనీ చేయకుండా ఖాళీగా గడిపిస్తుంటే హీరోయిన్ తట్టుకోలేక అతడి నుంచి విడిపోతుంటుంది. కానీ ఇందులో మాత్రం చిత్రంగా.. అప్పటిదాకా ఖాళీగా ఉన్న హీరో కొంచెం పని చేయడం మొదలుపెడితే అది తట్టుకోలేక ఇలా నువ్వు బిజీ అయితే కష్టం, ఎప్పుడూ ఖాళీగానే ఉండి నా గురించే ఆలోచించాలి అని కండిషన్ పెట్టి అందుకు ఒప్పుకోలేదని అతడి నుంచి విడిపోతుంది కథానాయిక. సినిమా ఉన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇదే. ఇది కూడా ముగింపు దశలో వస్తుంది. ఇలాంటి పాయింటుకి ప్రేక్షకులు ఎలా కనెక్టవుతారని అనుకున్నారో ఏమిటో?

అర్థ రహితంగా అనిపించే ఈ పాయింట్ మినహాయిస్తే ‘దేవ్’ కథలో అసలు ఏ మలుపులూ లేవు. హీరో పరిచయ సన్నివేశాల దగ్గర్నుంచి చివరి 20 నిమిషాల ముందు వరకు చాలా ఫ్లాట్ గా.. బోరింగ్ గా సాగిపోతుంది ‘దేవ్’. మనం చూస్తున్నది రొమాంటిక్ సీన్స్ అనే ఫీల్ కలిగించడానికి కెమెరామన్, సంగీత దర్శకుడు విఫలయత్నం చేస్తుంటారు కానీ.. ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని సన్నివేశాల కారణంగా ఆ ఫీల్ ఎక్కడా కలగదు. ఆ అమ్మాయి అంటే నీకెందుకు ఇంతిష్టం అని హీరో ఫ్రెండ్స్.. నేనంటే నీకెందుకంత పిచ్చి అని హీరోయిన్.. హీరోను అదే పనిగా అడుగుతుంటారు. కానీ నిజంగా హీరో కథానాయిక విషయంలో అంత పిచ్చోడైపోయాడా అని మనకు సందేహం కలుగుతుంటుంది. అతడికి ఆమెపై ప్రేమ పుట్టడానికి కానీ.. ఆమెకు ఇతడి పట్ల ఆకర్షితురాలు అవడానికి కానీ సరైన కారణాలే కనిపించవు. ప్రేమ సన్నివేశాలేవీ కూడా ఆసక్తి రేకెత్తించవు.

ప్రథమార్ధం అయితే మరీ బోర్ కొట్టించేస్తుంది. ప్రత్యేకంగా అనిపించే ఒక్క సీన్ లేదు. ఎక్కడా హై పాయింట్ లేదు. ద్వితీయార్ధంలో కథ కొంచెం మలుపు తిరిగినా.. అది కృత్రిమంగా అనిపిస్తుంది. సినిమా ముగించడానికి ఇదో ప్రయత్నం లాగా అనిపిస్తుంది. ప్రధానంగా ప్రేమకథ అయిన ‘దేవ్’లో లవ్ ఫీల్ ఎక్కడా కనిపించదు. మిగతా రసాలు కూడా పండలేదు. హీరో ఫ్రెండు పాత్రతో చేయించినదాన్ని కామెడీ అని అంగీకరించడం కష్టమే. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి పెద్ద నటీనటుల్ని పెట్టుకుని వాళ్లకు పేలవమైన పాత్రలిచ్చారు. వారికి ఎవరో డబ్బింగ్ చెప్పడంతో అసలేమాత్రం ఆ పాత్రలతో కనెక్ట్ కాలేం. మొత్తంగా హీరో హీరోయిన్ల ఆకర్షణ.. సాంకేతిక హంగులు.. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ మినహాయిస్తే ‘దేవ్’లో చెప్పుకోవడానికి ఏమీ లేదు.

నటీనటులు:

కార్తి గత సినిమాలతో పోలిస్తే భిన్నంగా కనిపించాడు. లుక్ బాగుంది. నటన కూడా ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్ కు తగ్గ యాటిట్యూడ్ చూపించాడు. కానీ అతడి పాత్రను సరిగా తీర్చిదిద్దలేదు. ఒక దశా దిశా లేకుండా సాగే అతడి పాత్ర.. కార్తి ఎఫర్ట్ ను వృథా చేస్తుంది. రకుల్ ప్రీత్ చాలా గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకుంది కానీ.. ఆమె పాత్రను కూడా సరిగా తీర్చిదిద్దలేదు. కొన్ని చోట్ల ఆమె లుక్ తేడాగా అనిపిస్తుంది. రకుల్ కు మేకప్ బాగా లేదు. ప్రకాష్ రాజ్.. రమ్యకృష్ణ ఇలాంటి పాత్రల్ని ఎలా ఒప్పుకున్నారో అనిపిస్తుంది. హీరో ఫ్రెండుగా చేసిన విఘ్నేష్ కాంత్ కామెడీ పేరుతో విసిగించాడు. మిగతా నటీనటులెవరి గురించి చెప్పానికి ఏమీ లేదు.

సాంకేతికవర్గం:

‘దేవ్’లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది సాంకేతిక నిపుణుల కృషే. హారిస్ జైరాజ్ చాన్నాళ్ల తర్వాత తన ముద్ర చూపించాడు. కొన్ని పాటలు వింటేజ్ హారిస్ ను గుర్తుకు తెస్తాయి. తన వరకు మంచి ఔట్ పుట్ ఇచ్చి సినిమాకు మ్యూజిక్ ద్వారా ఫీల్ తెచ్చే ప్రయత్నం చేశాడు. వేల్ రాజ్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ పరంగా ఆరంభం నుంచి ఒక స్టాండర్డ్ కనిపిస్తుంది ‘దేవ్’లో. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కానీ దర్శకుడు రజత్ రవిశంకర్ కు అన్ని వనరులూ సమకూర్చినా ఏమాత్రం ఉపయోగించుకోలేక ఒక బోరింగ్ సినిమా తీసి పెట్టాడు. అతను ఎంచుకున్న కథలో ఏ ప్రత్యేకతా లేదు. బోరింగ్ నరేషన్ తో మరీ నీరసం తెచ్చేశాడతను. దర్శకత్వ పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

చివరగా: దేవ్.. బోరింగ్ బొమ్మ

రేటింగ్: 1.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre