Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'డియర్ కామ్రేడ్'

By:  Tupaki Desk   |   26 July 2019 7:59 AM GMT
మూవీ రివ్యూ : డియర్ కామ్రేడ్
X
చిత్రం : 'డియర్ కామ్రేడ్'

నటీనటులు: విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా - శ్రుతి రామచంద్రన్ - ఆనంద్ - సుహాస్ - చారు హాసన్ - సంజయ్ స్వరూప్ తదితరులు
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఛాయాగ్రహణం: సుజీత్ సారంగ్
మాటలు: జయకృష్ణ
నిర్మాాతలు: నవీన్ ఎర్నేని - యలమంచిలి రవిశంకర్ - మోహన్ చెరుకూరి - యాష్ రంగినేని
రచన - దర్శకత్వం: భరత్ కమ్మ

కొత్త దర్శకులతో అద్భుతాలు చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఈసారి భరత్ కమ్మ అనే డెబ్యూ డైరెక్టర్ తో కలిసి ‘డియర్ కామ్రేడ్’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆహ్లాదకరమైన టీజర్.. ట్రైలర్.. ఆడియోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం.. తెరపై ఎలాంటి ముద్ర వేసిందో చూద్దాం పదండి.

కథ:

చైతన్య అలియాస్ బాబీ (విజయ్ దేవరకొండ) కమ్యూనిస్టు భావాలున్న కాలేజీ కుర్రాడు. విద్యార్థుల సంఘాన్ని నడిపిస్తూ తరచుగా గొడవల్లో పాలుపంచుకునే అతను.. హైదరాబాద్ నుంచి ఓ పెళ్లి కోసం తన పక్కింటికి వచ్చిన అపర్ణ అలియా లిల్లీ (రష్మిక మందన్నా)ను చూసి ఆకర్షితుడవుతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ బాబీ ఎంత చెప్పినా వినకుండా గొడవల్లో తలదూర్చుతుండటంతో లిల్లీ అతడికి దూరమవుతుంది. ఈ స్థితిలో ఒకరికొకరు దూరమయ్యా బాబీ.. లిల్లీ ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఎలాంటి వేదన అనుభవించారు.. వాళ్లిద్దరూ చివరికి కలిశారా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

బలమైన పునాది వేసి.. చక్కగా గోడలు కట్టి.. ప్లాస్టింగ్ అదీ కూడా బాగా చేసి.. ఇల్లంతా చక్కగా కట్టాక చివరికి అసలు ఆ ఇంటికి ఏమాత్రం నప్పని రంగులేస్తే ఎలా ఉంటుంది? ‘డియర్ కామ్రేడ్’ సినిమా విషయంలో అచ్చంగా ఇలాగే జరిగింది. దర్శకుడు భరత్ కమ్మ.. కాస్త భిన్నమైన కథనే రాసుకున్నాడు. హీరో హీరోయిన్ల పాత్రల్ని చక్కగా తీర్చిదిద్దుకున్నాడు. ఆ పాత్రలకు మంచి జోడీని ఎంచుకున్నాడు. వాళ్లిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్‌ ను చాలా చక్కగా నడిపించాడు. ప్రేమకథలో మంచి ఫీల్ తీసుకొచ్చాడు. కొంచెం నెమ్మదిగా అనిపించినా.. ప్లెజెంట్ ఫీలింగ్ ఇచ్చే నరేషన్ తో చాలా వరకు సినిమాను అందంగా నడిపిస్తూ వెళ్లాడు. కానీ ఒక దశ వరకు క్లాసిక్ టచ్ కనిపించే ‘డియర్ కామ్రేడ్’ ను.. తర్వాత ఎలా ముందుకు తీసుకెళ్లాలో.. ఎలా ముగించాలో తెలియక తడబడ్డాడు. అంత వరకు నడిపించిన అందమైన శైలిని విడిచిపెట్టి.. ఒక సగటు దర్శకుడిలా మారిపోయాడు. కథను పూర్తిగా పక్కదారి పట్టించే ఎపిసోడ్ మీద కథనాన్ని నడిపించి.. బాగా సాగదీసి.. ఒక సాధారణమైన ముగింపుతో అంతకు ముందు ఉన్న పాజిటివ్ ఫీలింగ్ ను దెబ్బ తీశాడు. ఒక రకంగా చెప్పాలంటే భరత్ మంచి సినిమాను చేజేతులా దెబ్బ తీసుకున్నాడు. క్లాసిక్‌ గా మిగిలే స్థాయి నుంచి.. చివరికి ఒక సగటు సినిమా స్థాయికి పడిపోయింది డియర్ కామ్రేడ్.

దర్శకుడు భరత్ కమ్మలో విషయం ఉంది. అతడిలో మంచి నరేటర్ ఉన్నాడు. కాకపోతే ఒకేసారి చాలా విషయాలు చెప్పాలనుకోవడంతోనే వచ్చింది సమస్య. అతను అందమైన ప్రేమకథను చెప్పడంతో పాటు కమ్యూనిజం భావజాలాన్ని.. ఒక సామాజిక సమస్యను కూడా డిస్కస్ చేయాలనుకున్నాడు. ఐతే ప్రేమకథను ఆహ్లాదంగా నడిపించగలిగిన అతను.. మిగతా రెండు విషయాల్ని ప్రభావవంతంగా తెరమీదకిి తీసుకురాలేకపోయాడు. ముఖ్యంగా క్రికెట్లో రాజకీయాలు - మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఎపిసోడ్ అసలీ సినిమాలో సింక్ కాలేదు. ప్లెజెంట్ లవ్ స్టోరీలో అది చాలా భారంగా అనిపిస్తుంది. రెండు మూడు సీన్లలో ముగించాల్సిన వ్యవహారాన్ని విపరీతంగా సాగదీయడం.. పతాక సన్నివేశంలో అవసరం లేని గందరగోళాన్ని సృష్టించడంతో ‘డియర్ కామ్రేడ్’ గాడి తప్పింది. ఇక కమ్యూనిస్టు భావజాలాన్ని చెప్పడంలోనూ స్పష్టత లేకపోయింది. దాన్ని కూడా సినిమాలో ఇరికించినట్లు అనిపిస్తుంది తప్ప.. జనాల మనసుల్లోకి వెళ్లేలా డీల్ చేయలేకపోయాడు.

ఐతే ఈ ప్రతికూలతల్ని మన్నించి.. సినిమా చూసి కొన్ని జ్ఞాపకాల్ని పదిలపరుచుకోదగ్గ విషయం ‘డియర్ కామ్రేడ్’లో లేకపోలేదు. చాలా ప్లెజెంట్ గా సాగిపోయే ప్రథమార్ధం.. అందులోని ప్రేమకథ ‘డియర్ కామ్రేడ్’కు ప్రధాన ఆకర్షణ. రెండు బలమైన పాత్రలతో ఒక అందమైన ప్రేమకథను చెప్పే ప్రయత్నంలో దర్శకుడు భరత్ కమ్మ ఒక దశ వరకు బాగానే విజయవంతం అయ్యాడు. నరేషన్ కొంచెం నెమ్మది అన్న మైనస్ ను పక్కన పెడితే.. ప్రథమార్ధంలో బోరింగ్ అని కాని.. ఇదెందుకు అని కానీ.. బాగాలేదు అని కానీ అనిపించే మూమెంట్స్ ఏమీ లేవు. బాబీ-లిల్లీ పాత్రల పరిచయం దగ్గర్నుంచే ప్రేక్షకుల్ని ప్రేమలో పడేస్తారు. మరీ కొత్తగా అనిపించే సన్నివేశాలు లేకపోవచ్చు కానీ.. బాబీ-లిల్లీ రొమాంటిక్ ట్రాక్ లోని ప్రతి సన్నివేశం కూడా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య స్నేహం మొదలై.. ఆ తర్వాత అది ప్రేమగా మారే క్రమంలో వచ్చే మూమెంట్స్ కట్టి పడేస్తాయి. సన్నివేశాలకు తోడు.. వీనుల విందైన పాటలు - నేపథ్య సంగీతం.. ప్లెజెంట్ సినిమాటోగ్రఫీ కూడా చక్కగా అమరడంతో ప్రథమార్ధం వరకు ‘డియర్ కామ్రేడ్’ చక్కగా అనిపిస్తుంది.

ఐతే ప్రథమార్ధం వరకు ఒక తీరుగా సాగిపోయే సినిమా.. ద్వితీయార్ధంలో ఎటు పడితే అటు వెళ్లిపోతుంది. రెండో అర్ధంలో కూడా కొన్ని మంచి మూమెంట్స్ లేకపోలేదు. మూడేళ్ల పాటు అందరికీ దూరమై రోడ్ జర్నీలో కథానాయకుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ఎపిసోడ్ లో దర్శకుడి స్థాయి కనిపిస్తుంది. కానీ తెరలు తెరలుగా వచ్చిపోయే ఈ ఎపిసోడ్ మినహాయిస్తే మిగతా వ్యవహారమే చాలా గందరగోళంగా తయారైంది. ద్వితీయార్దంలో హీరో పాత్ర చిత్రణే చాలా కన్ ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. అతడి చర్యలు గందరగోళానికి గురి చేస్తాయి. అసలే సినిమా ఎటు పోతోందో అర్థం కాని అయోమయం నెలకొంటే.. ప్రధానంగా ఎమోషన్ల మీదే నడుస్తున్న సినిమాలో క్రికెట్ రాజకీయాలు.. లైంగిక వేధింపుల ఎపిసోడ్ ను లౌడ్ గా డీల్ చేయడంతో సినిమా నడతే దెబ్బ తినేసింది. ఒక భావోద్వేగంతో - ఫీల్ తో కూడిన ముగింపు ఆశించే చోట పతాక సన్నివేశం అంచనాలకు పూర్తి భిన్నంగా సాగి నిరాశ పరుస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ద్వితీయార్ధంలోని ప్రతికూలతల్ని మినహాయిస్తే.. ఒక దశ వరకు ఆహ్లాదంగా సాగే ప్రేమకథ.. లీడ్ పెయిర్ పెర్ఫామెన్స్.. సాంకేతిక నిపుణుల ప్రతిభ కోసం ‘డియర్ కామ్రేడ్’ ఒకసారి చూడొచ్చు.

నటీనటులు:

విజయ్ దేవరకొండ మరోసారి పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతడి పాత్రలో ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు కనిపించడం వల్ల కొత్తగా ఏమీ అనిపించదు. కానీ నటన పరంగా అతడిలో లోపాలేమీ వెతకడానికి అవకాశం లేదు. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్.. హావభావాలు.. నటన.. డైలాగ్ డెలివరీతో ప్రతి సన్నివేశంలోనూ బలమైన ముద్ర వేశాడు విజయ్. ఎమోషనల్ సీన్లలో విజయ్ నటన గుర్తుండిపోతుంది. విజయ్ ఎలాంటి పెర్ఫామరో తెలిసిందే కాబట్టి అతడి విషయంలో ఏదీ ఆశ్చర్యంగా అనిపించదు. కానీ రష్మిక మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. సినిమా అంతా ప్రధానంగా తన చుట్టూనే తిరిగే అత్యంత కీలకమైన పాత్రలో రష్మిక రాణించింది. ఇది ఆమెకు లైఫ్ టైం క్యారెక్టర్ అని చెప్పొచ్చు. తీవ్ర మానసిక సంఘర్షణ అనుభవించే సన్నివేశాల్లో రష్మికను చూస్తే ఆమె కాకుండా పాత్ర మాత్రమే కనిపిస్తుంది. నిజంగా ఒక అమ్మాయి వేదనను చూస్తున్న భావన కలుగుతుంది. హీరో ఫ్రెండు పాత్రలో సుహాస్ మెరిశాడు. మిగతా స్నేహితులుగా నటించిన వాళ్లూ ఆకట్టుకున్నారు. చారుహాసన్.. ఆనంద్ ఉన్నంతలో బాగా చేశారు కానీ.. వాళ్లకు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. హీరోయిన్ అక్క పాత్రలో శ్రుతి రామచంద్రన్ ఆకట్టుకుంది. క్రికెట్ సెలక్టర్ పాత్రలో చేసిన నటుడు మెప్పించాడు.

సాంకేతికవర్గం:

‘డియర్ కామ్రేడ్’లో సాంకేతిక నిపుణులందరి పనితీరూ ఆకట్టుకుంటుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువ. గత కొన్నేళ్లలో బెస్ట్ ఆడియోల్లో ‘డియర్ కామ్రేడ్’ది ఒకటనడంలో సందేహం లేదు. ఏ పాటకు ఆ పాట ప్రత్యేకంగా అనిపిస్తాయి. కడలల్లే.. నీ నీలి కన్నుల్లోన.. గిర గిర.. ఓ కలలా.. పాటలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. పాటల ప్లేస్మెంట్.. వాటి చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతంలోనూ జస్టిన్ తనదైన ముద్ర వేశాడు. సుజీత్ సారంగ్ ఛాయాగ్రహణం కూడా చాలా ప్లెజెంట్ గా సాగి.. సినిమాకు బలమైంది. కొన్ని మలయాళ సినిమాల క్లాసిక్స్ లుక్ తీసుకొచ్చాడు సుజీత్ ఈ చిత్రానికి. జయకృష్ణ డైలాాగులు సహజంగా ఉండి ఆకట్టుకుంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ - బిగ్ బెన్ సినిమాస్ నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. సినిమాకు ఏది అవసరమో అంతా సమకూర్చారు. మంచి ఔట్ పుట్ తీసుకొచ్చారు. దర్శకుడు భరత్ కమ్మ తనకు దక్కిన మంచి అవకాశాన్ని కొంతవరకే సద్వినియోగం చేసుకోగలిగాడు. అతడిలో ఒక మంచి ఫిలిం మేకర్ ఉన్న సంగతి పలు సందర్భాల్లో తెలుస్తుంది. కానీ ఒక కథను పూర్తి బిగితో.. ఒక తీరుగా నడపడంలో అతను విజయవంతం కాలేదు. రొమాంటిక్ ట్రాక్ నడిపించడంలో - ఎమోషన్లు పండించడంలో భరత్ ప్రతిభ కనిపిస్తుంది. సబ్ ప్లాట్స్ ఎక్కువ పెట్టుకోకుండా ప్రథమార్ధంలో చూపించిన తన బలాన్ని నమ్ముకుని అతను సాగిపోయి ఉంటే ‘డియర్ కామ్రేడ్’ ఒక ప్రత్యేకమైన సినిమాగా మిగిలేదే.

చివరగా: డియర్ కామ్రేడ్.. చేరువై.. దూరమై!

రేటింగ్-2.75/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre